ఇంటర్వ్యూ : కమల్ హాసన్ – మనోభావాలు దెబ్బతీయడానికి నేనేమీ ఫూల్‌ని కాదు!

Kamal-Haasan
విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచిన నటుడు కమల్ హాసన్. తన సినిమా ద్వారా ప్రతిసారీ ఏదో కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంటారాయన. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ఉత్తమ్ విలన్’. విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు కేంద్రమైన ఈ సినిమా ప్రస్తుతం అన్ని అడ్డంకులను దాటుకొని మే 1న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ఈ సినిమాను విడుదల చేయడానికి ఇన్ని ఇబ్బందులు ఎందుకొచ్చాయ్?

స) ఇండియాలో ఓ సినిమా విడుదల చేయడమనేది ఈ మధ్య కాలంలో పెద్ద సమస్యగా మారిపోయింది. ఏ కారణమూ లేకుండానే సినిమాపై వివాదాలు సృష్టించడం పెరిగిపోయింది. భారత్ ఒక ప్రజాస్వామిక దేశం, ఇక్కడ ప్రతీ ఒక్కరికీ మాట్లాడే హక్కు, తాము ఏమనుకుంటున్నామనేది సినిమాగా తీసే హక్కు ఉంది.

ప్రశ్న) మీ సినిమాకు సెన్సార్ తరపున ‘యూ’ సర్టిఫికెట్ వచ్చాక కూడా ఈ గొడవలు ఎందుకొచ్చాయంటారు?

స) కొన్ని హిందూ సంస్థలు ఈ సినిమాకు వ్యతిరేకంగా పోరాడాయి. భారతదేశంలో సుమారు 75% మంది హిందువులు ఉన్నారు. వారి మనోభావాలను దెబ్బతీయడానికి నేనేమైనా ఫూల్‌నా? అయినా ఒకరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఆలోచన ఎందుకొస్తుంది? నా సినిమా అందరూ చూడడమే కదా నేనూ కోరుకునేది.

ప్రశ్న) రమేష్ అరవింద్‌నే దర్శకుడిగా ఎంచుకోవడానికి కారణం?

స) ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే రాసింది నేనే. అయితే ఆ స్క్రిప్ట్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించగలిగే వ్యక్తి రమేష్ అని నమ్మాను కాబట్టే అతడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించా. రమేష్ నాకు ఎప్పణ్ణుంచో మంచి మిత్రుడు. నేననుకున్న విధంగానే సినిమా చాలా బాగా తీశాడు.

ప్రశ్న) మీ గురువులు బాలచందర్, కె. విశ్వనాథ్ గార్లతో కలిసి నటించడం ఎలా ఉండేది?

స) ఇంతకుముందే చాలా సినిమాల్లో వారితో కలిసి నటించా. వారితో కలిసి నటించడమనేది ఎప్పటికీ అద్భుతంగానే ఉంటుంది.

ప్రశ్న) ట్రైలర్ విజువల్స్ చాలా బాగున్నాయి. డ్యాన్సులు కూడా భారీగా ఉన్నట్టున్నాయ్?

స) అవును. సినిమాలో క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో వచ్చే చాలా సన్నివేశాలున్నాయి. ఈ సినిమాలో గ్రూపు డ్యాన్సర్లుగా పనిచేసిన వారు దేశంలోనే పేరుగాంచిన నాట్యకారులు. ముందే రిహార్సల్స్ అవీ చేయడంతో ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.

ప్రశ్న) ‘ఉత్తమ విలన్’ ఆర్ట్ సినిమానా?

స) అసలు ఆర్ట్ సినిమా అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. మనం ఏ సినిమా చేసినా ప్రేక్షకుల కోసమే చేస్తాం. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటాం. అందరూ ఆ సినిమా చూడాలి, మా ప్రయత్నాన్ని అభినందించాలనే కోరుకుంటాం.

ప్రశ్న) తెలుగు వర్షన్ కోసం ఏమైనా మార్పులు చేశారా?

స) తెలుగు వర్షన్ కోసం మొదట్నుంచీ చాలా కష్టపడ్డాం. తెలుగుకు తగ్గట్టుగా కొన్ని సీన్లు రెండు భాషల్లో తీశాం. తెలుగులో ఈ సినిమాకు ఈ స్థాయి ప్రమోషన్‌ను కల్పించిన సి. కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి.

ప్రశ్న) సినిమాలో హీరోయిన్ల గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో ఆండ్రియా, పూజా కుమార్‌లు హీరోయిన్లుగా నటించారు. వారిద్దరూ వారి వారి పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. వారిద్దరి పాత్రలను ప్రతి ఒక్కరికీ నచ్చుతాయనే ఆశిస్తున్నా.

ఇక అక్కడితో కమల్ హాసన్‌తో మా ఇంటర్వ్యూ ముగిసింది. మే 1న ఉత్తమ విలన్ విడుదలవుతున్న సందర్భంగా సినిమా యూనిట్‌కు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

Exit mobile version