ఇంటర్వ్యూ : కోడి రామకృష్ణ – నిర్మాతలు బాగుంటేనే సినిమా బాగుంటుంది!

kodi-ramakrishna
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు కోడి రామకృష్ణది ఓ ప్రత్యేకమైన శైలి. తన కెరీర్లో ఎన్నో జానర్స్‌లో సినిమాలు తీసి మెప్పించిన ఆయన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలైన ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నారు. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన నాగరహవు అనే సినిమాను తెలుగులో నాగాభరణం పేరుతో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 14న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు కోడి రామకృష్ణతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) నాగభరణం అంటూ చాలాకాలం తర్వాత వస్తున్నారు. ఎలా ఉంది?

స) నా సినిమాలన్నింటికీ విడుదలప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే నాగభరణం విషయంలో నేను ఈ స్థాయి క్రేజ్ అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. తెలుగులో కూడా విజువల్ ఎఫెక్ట్స్‌లో సాహసం అంటూ క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ దృష్ట్యానే సుమారు 600 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఇదంతా చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) కన్నడలో చేసిన సినిమా ఇలా తెలుగులో డబ్ అవుతూ ఉండడం ఎలా ఉంది?

స) నేను తెలుగులో చేసిన చాలా సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతూ ఉండేవి. ఈసారి కన్నడలో చేసిన ఓ సినిమా తెలుగులో వస్తోంది. ఇది కన్నడ సినిమా అయినా నిర్మాతలు తెలుగు వర్షన్‌కు మొదట్నుంచీ మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి మించి తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తోన్న శివకుమార్ గారి ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. స్ట్రైట్ తెలుగు సినిమాలా నాగభరణం విడుదలవుతుందంటే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఎఫర్ట్స్ వల్లే!

ప్రశ్న) నాగభరణంతో చనిపోయిన వ్యక్తిని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆవిష్కరించడం ఎలా అనిపించింది?

స) అదొక అద్భుతమైన సాహసం. రమ్య ప్రధాన పాత్రలో నడిచే ఈ సినిమాలో చివరి 15 నిమిషాల్లో ఒక బలమైన పాత్ర కథను మలుపు తిప్పుతుంది. ఆ పాత్రకు దివంగత సూపర్ స్టార్ విష్ణు వర్ధన్‌ను పెడదాం అని నిర్మాతలు అన్నప్పుడు ఆశ్చర్యపోయా. ఆ తర్వాత మకుట విజువల్ ఎఫెక్ట్స్ దీన్ని నిజం చేస్తుందని తెలుసుకొని ఆ దిశగా అడుగులేశాం. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మేం చేసిన ఈ సాహసమే అందరి దృష్టినీ ఆకర్షించింది.

ప్రశ్న) విష్ణు వర్ధన్ గారి పాత్ర ఎంత సేపు ఉంటుంది?

స) 15 నిమిషాల పాటు విష్ణువర్ధన్ గారి పాత్ర ఉంటుంది. చనిపోయిన ఆయనను అలా మళ్ళీ ఆవిష్కరించడం అన్నది ఇండియన్ సినిమాలో ఒక అతిపెద్ద ప్రయోగం. విజువల్స్ చూశాక, విష్ణువర్ధన్ గారి భార్య ఏడ్చేశారు. ఆయనను మళ్ళీ ఇలా సినిమాలో ఆవిష్కరించారా? అంటూ ఆవిడ కన్నీళ్ళు పెట్టినప్పుడు మా ప్రయోగం మరింత సంతృప్తినిచ్చింది.

ప్రశ్న) గ్రాఫిక్స్‌ సినిమాల అవసరం, వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానిపై మీ ఆలోచనలేంటి?

స) గ్రాఫిక్స్ మన కథకు అవసరమైనప్పుడు తీసుకోవడం మంచిదే! కంటెంట్ స్థాయిని ఈ గ్రాఫిక్స్ మరింత పై స్థాయికి తీసుకెళ్ళేలా ఉండాలన్నది నా అభిప్రాయం. దానికి తగ్గట్టే దర్శకులు ప్లాన్ చేసుకోవాలి. నా దృష్టిలో నిర్మాత అంటే సినిమాకు దేవుడితో సమానం. నిర్మాతలు బాగుంటేనే సినిమా బాగుంటుంది. ఆవిధంగా నిర్మాత ఎలా సేఫ్ జోన్‌లో ఉండాలో చూసుకుంటూ సినిమాలు నిర్మించాలి.

ప్రశ్న) గ్రాఫిక్స్ సినిమాలతో తెలుగులో ఒక కొత్త పంథా సృష్టించారు కదా. ఆ సినిమాల అనుభవం గురించి క్లుప్తంగా చెప్పగలరా?

స) నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ‘అమ్మోరు’ సినిమాతో గ్రాఫిక్స్‌ను తెరపైకి తెచ్చారు. అప్పట్నుంచే గ్రాఫిక్స్‌తో ప్రయాణం చేస్తూనే వస్తున్నా. కొత్తగా టెక్నాలజీలో ఏ మార్పులొచ్చినా వెంటనే వాటి గురించి తెలుసుకుంటూ ఉంటా. అంజి, అరుంధతి ఇలాంటి సినిమాలతో శ్యామ్ గారితో కలిసి గ్రాఫిక్స్‌ను కొత్తగా పరిచయం చేశాం. ఇప్పుడు నాగభరణంతో మళ్ళీ కొత్త ప్రయాణం. ఇవన్నీ తెరపైకి వస్తున్నాయంటే డెడికేషన్ ఉన్న నిర్మాతల వల్లే. ఏ దర్శకుడైనా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ విషయాలను ఆలోచించాలి.

ప్రశ్న) నాగభరణం సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు?

స) నిజానికి మేము ఈ స్థాయి క్రేజ్ ఉంటుందని ఊహించలేదు కాబట్టి, కాస్త టెన్షన్ అయితే ఉంది. అయితే మంచి ఔట్‌పుట్‌తో సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నాం. దీంతో తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) పుట్టపర్తి సాయిబాబా సినిమా ఎంతవరకు వచ్చింది?

స) నాగభరణం విడుదల కాగానే పుట్టపర్తి సాయిబాబా సినిమా మళ్ళీ మొదలవుతుంది. ఆ సినిమా ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రధాన భాషలన్నింటిలో విడుదలవుతుంది.