ఇంటర్వ్యూ : నాగార్జున – వందో సినిమాకు నా లెక్కలు వేరే ఉన్నాయి!

31st, January 2017 - 07:28:59 PM

కింగ్ అక్కినేని నాగార్జునది స్టార్ హీరోల్లో భిన్నమైన శైలి. సరికొత్త ప్రయోగాలను, కమర్షియల్ సినిమా ఫార్మాట్‌కు దూరం పోకుండా చేస్తారన్న పేరుందాయనకు. ఈ క్రమంలోనే ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఈతరం ప్రేక్షకుల్లోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నాగార్జున, ఫిబ్రవరి 10న ‘ఓం నమో వెంకటేశాయ’ అంటూ భక్తిరస చిత్రంతో వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీ సాయి’ తర్వాత ‘ఓం నమో వెంకటేశాయ’ అంటూ మరో భక్తిరస చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకతలేంటి?

స) ఈ జానర్‌లో నేను చేసిన అన్ని సినిమాల్లానే ‘ఓం నమో వెంకటేశాయ’లోనూ బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్‌నే ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. రాఘవేంద్రరావు గారు ఒక భక్తిరస చిత్రాన్ని కూడా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చేయగలరు. ఈ సినిమాలోనూ ఆయన మార్క్ చూడొచ్చు.

ప్రశ్న) అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామికి భక్తుడిగా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ వెంకటేశ్వర స్వామికి భక్తుడిగా చేశారు. ఈ రెండు సినిమాలకు పోలికలు ఉంటాయా?

స) ‘ఓం నమో వెంకటేశాయ’కు, ‘అన్నమయ్య’కు అస్సలు పోలిక ఉండదు. రెండు సినిమాల్లోనూ నేను వెంకటేశ్వర స్వామికి భక్తుడిగానే నటించినా, కథా పరంగా రెండింటికీ పోలికలు ఉండవు.

ప్రశ్న) ఓం నమో వెంకటేశాయలో మీరు చేసిన హతిరామ్ బాబా రోల్ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

స) హతిరాం బాబా గురించి చరిత్రలో చాలా తక్కువ సమాచారమే ఉంది. అన్నమయ్య విషయంలో అన్నమాచార్యుల గురించి చాలా తెలిసి ఉండడం, ఆయన పాటలనే మేము వాడుకోవడంతో అప్పుడు పెద్ద ఇబ్బంది పడలేదు. ఇక్కడ రామ్ బాబా విషయానికి వస్తే, ఆయన గురించి తక్కువ తెలిసి ఉండడంతో మేమే ఓ కథగా మలిచేందుకు ఫిక్షన్ జోడించాల్సి వచ్చింది. రామ్ బాబా ఎక్కడో ఉత్తర భారత దేశం నుంచి ఇక్కడకు రావడం, వెంకటేశ్వర స్వామి సేవకే తన జీవితాన్ని అంకితం చేయడం, ఇలా ఈ పాత్రలో మంచి ఎమోషన్ ఉండడంతో చరిత్ర తక్కువే తెలిసినా వెనుకడుగు వేయలేదు. ఇక లుక్ విషయంలో దర్శకుడు రాఘవేంద్రరావు గారి ఆలోచనకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నా.

ప్రశ్న) వెంకటేశ్వర స్వామిగా తెలిసిన నటుడిని కాకుండా హిందీ టీవీ నటుడు సౌరభ్ రాజ్ జైన్ ను తీసుకోవడానికి కారణం?

స) వెంకటేశ్వరస్వామికి నిత్య యవ్వనుడనే పేరుంది. ఆయన పేరు చెప్పగానే ఒక రూపం కనిపిస్తుంది. సౌరభ్ రాజ్ జైన్ వెంకటేశ్వరస్వామి పాత్రకు సరిపడా అర్హతలు అన్నీ ఉన్నాయనిపించి అతడిని ఎంపికచేశాం. రేపు సినిమా చూశాక అందరూ మా నిర్ణయం సరైనదనే చెబుతారు.

ప్రశ్న) రాఘవేంద్రరావుతో మరోసారి పనిచేయడం గురించి చెప్పండి?

స) రాఘవేంద్రరావు గారు కమర్షియల్ సినిమా అయినా, భక్తిరస చిత్రమైనా మంచి కమిట్‌మెంట్‌తో చేస్తారు. మా ఇద్దరి కాంబినేషన్లో ఇలా నాలుగు భక్తిరస చిత్రాలు వస్తాయని నేనూ ఊహించలేదు. ‘సెట్లో ఇదే నా చివరి సినిమా కావొచ్చు నాగ్’ అంటూండేవారు. అది నిజం కావొద్దని, ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా.

ప్రశ్న) ఆడియో ఇప్పటికే పాపులర్ అయిపోయింది. సినిమా విజయానికి ఆడియో ఎంతవరకు దోహదపడుతుందనుకుంటున్నారు?

స) ఆడియో మేము ఊహించినదానికంటే బాగా పాపులర్ అయింది. అదేంటోగానీ కీరవాణి గారు భక్తిరస చిత్రం అనగానే అందుకు తగ్గట్టే, అందరూ ఆ లోకంలోకి వెళ్ళిపోయి వినేలా పాటలు సమకూరుస్తారు. ఈ పాటలన్నీ కథను ముందుకు నడిపించేవే కావడంతో, సినిమాగా చూస్తే అవి ఇంకా బాగా ఆకట్టుకుంటాయన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ల పాత్రల గురించి చెప్పండి?

స) అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌లవి ఇందులో కథ పరంగా వచ్చే ప్రధాన పాత్రలే తప్ప, హీరోయిన్ అని అనలేం. అన్నమయ్య, రామదాసులా ఇక్కడ రొమాన్స్‌కి కూడా ఆస్కారం లేదు. అనుష్క ఎప్పట్నుంచో స్వామివారి సేవకే అంకితమైన భక్తురాలి పాత్రలో నటించింది. ఎక్కడ్నుంచో ఇక్కడికొచ్చిన రామ్ బాబాకు ఒక గైడ్‌లా అనుష్క పాత్రను చెప్పుకోవచ్చు.

ప్రశ్న) ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’.. ఇలా వరుస హిట్స్‌తో ఈతరం ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటి మార్కెట్ పరిస్థితులకు, ప్రేక్షకులకు ‘ఓం నమో వెంకటేశాయ’ చేరుతుందనుకుంటున్నారా?

స) నేనైతే ఈతరం ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా తీసుకుంటారన్నది జడ్జ్ చేయలేను. అయితే ‘మనం’ నుంచి నా అన్ని సినిమాలనూ చూడడానికి ఆసక్తి చూపుతున్న ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ ఒక ఇంటివాళ్ళు కాబోతూ ఉండడం ఓ తండ్రిగా ఎలాంటి అనుభూతినిస్తోంది?

స) చాలా బాగుంది. నిన్న ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో చూస్తే చై-సమంత జంట, అఖిల్-శ్రేయా జంట చాలా హ్యాపీగా కనిపించారు. వాళ్ళలా హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా తమ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. తండ్రిగా చాలా ఎగ్జైటింగ్ మూమెంట్ అనిపించడం వల్లే, సోషల్ మీడియాలో ఫోటోలు అఫీషియల్‌గా నేనే విడుదల చేశా.

ప్రశ్న) చివరగా ప్రస్తుతం చేస్తోన్న ‘రాజుగారి గది 2’, ‘బంగార్రాజు’ సినిమాల గురించి చెప్పండి? అదేవిధంగా ‘బంగార్రాజు’ మీ వందో సినిమా అవుతుందని అభిమానులు లెక్కలేశారు, ఆ వందో సినిమాకు ప్రత్యేకంగా ఏం ప్లాన్ చేస్తున్నారు?

స) ‘రాజుగారి గది 2’ హర్రర్ కామెడీ జానర్లో వస్తోన్న సినిమా. ఇలా భక్తిరస చిత్రం అయిపోగానే హర్రర్ సినిమా చేస్తూ ఉండడం కొత్తగా ఉంది. రాజుగారి గది 2 పూర్తయ్యాక బంగార్రాజు మొదలవుతుంది. బంగార్రాజును వందో సినిమాగా అభిమానులు లెక్కేస్తున్నా, వందో సినిమా విషయంలో నా లెక్కలు వేరే ఉన్నాయి. నేను చేసిన గెస్ట్ రోల్స్ కూడా కలిపేసి వంద సినిమాలని లెక్క తేల్చారు. నేనే త్వరలో అన్నీ లెక్కచేసి వందో సినిమా ఏది?అది ఎప్పటికి వస్తుంది? అన్నది చెబుతా.