ఇంటర్వ్యూ : అక్కినేని నాగార్జున – నాగ చైతన్య, అఖిల్‍లకు మాటిచ్చా!
Published on Sep 9, 2016 1:00 pm IST

nagarjuna
పరిశ్రమలో స్టార్ హీరో హోదా ఉండి మారుతున్న కాలంతో పాటే మారి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటూ కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో చిన్న సినిమాలను ఆదరిస్తున్న వ్యక్తి అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ తనయుడు రోషన్ న హీరోగా పరిచయం చేస్తూ ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్ర విశేషాలేమిటో ఆయన్నే అడిగి తెలుసుకుందాం…

ప్ర) శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ గురించి మీ అభిప్రాయం ?
జ) రోషన్ చాలా మంచి కుర్రాడు. టాలెంట్ ఉంది. ఆడియోలో అతను మాట్లాడిన తీరు చూస్తే నాకు ముచ్చటేసింది. ఖచ్చితంగా పైకొస్తాడు. ఈ సినిమాలో చాలా బాగా నటించాడు.

ప్ర) సినిమాలో మీ పాత్ర గురించి ఎమన్నా చెబుతారా ?
జ) సినిమాలో నా పాత్ర చాలా ముఖ్యమైంది. మొదటి భాగంలో ఉంటాను, సెకండ్ హాఫ్ లో అయితే మొదటి నుండి ఎండింగ్ వరకూ ఉంటాను. మూవీకి నా క్యారెక్టర్ చాలా కీలకం. బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు ఉంటే తప్పకుండా నాకే ఇవ్వాలి. ఇప్పటి వరకూ హీరోగానే చేశా. ఇది కొత్త అనుభవం.

ప్ర) సపోర్టింగ్ రోల్స్ మీ బ్యానర్లో మాత్రమే చేస్తారా ?
జ) అదేం లేదు. వేరే బ్యానర్లో కూడా చేస్తాను. కథ బాగుండి, కొత్తగా అనిపిస్తే ఎవరితోనైనా తప్పకుండా చేస్తాను. నాకు అలాంటి అభ్యంతరాలేమీ లేవు.

ప్ర) బాగా పాపులర్ అయిన టైం లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో నుండి తప్పుకోవడం ఏమిటి ?
జ) ఏదైనా మనం బాగా చేస్తున్నప్పుడే తప్పుకోవడం మంచిది. ఇదీ అంతే. ఈ ప్రోగ్రామ్ నాకు మంచి అనుభవం. తరువాతి సీజన్ చిరంజీవి గారు చేస్తానన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా తప్పకుండా హిట్టవుతుంది.

ప్ర) మరి చిరంజీవి గారికి ఏమైనా సలహాలిచ్చారా ? ఆయన ముందు హాట్ సీట్లో కూర్చుంటారా ?
జ) చిరంజీవిగారికి సలహాలివ్వక్కర్లేదు. కానీ షో పరంగా కొన్ని చిన్న చిన్న సలహాలిస్తాను. అలాగే చిరంజీవిగారి ముందు హాట్ సీట్లో తప్పకుండా కూర్చుంటాను.

ప్ర) వేరే హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తారా ?
జ) ఇప్పుడప్పుడే ఏమీ అనుకోలేదు. పైగా అఖిల్, నాగ చైతన్యల కొత్త సినిమాలు మొదలవుతున్నాయి. వాళ్లతో చేస్తానని మాటిచ్చాను. తప్పకుండా చేయాలి. ఆ ఆతరువాతే ఏదైనా.

ప్ర) మీ ‘ఓం నమో వెంకటేశాయ’ ఎంతవరకూ వచ్చింది. సంక్రాంతికి విడుదలని విన్నాం ?
జ) సంక్రాంతికి విడుదల.. ఏమో చెప్పలేం. చాలా సీజీ వర్క్ ఉంది. అన్నీ పర్ఫెక్ట్ గా చేయాలి. అసలే బాహుబలి సీజీతో రాజమౌళి వండర్స్ చేశాడు. కాబట్టి తప్పులేమీ లేకుండా చూసుకుని నిదానంగా చేస్తున్నాం.

ప్ర) బాహుబలి – 2 కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యయేషన్ రైట్స్ కొన్నారట. నిజమేనా ?
జ) లేదు. నేను ఎలాంటి సినిమా రైట్స్ కొనలేదు. అందులో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే.

ప్ర) ఇప్పటికీ వరుస హిట్లిస్తున్నారు. మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఇప్పటికీ స్టార్ డమ్ మోయడం కష్టంగా లేదా ?
జ) మంచి కథలు, మంచి పాత్రలు చేస్తే హిట్లు ఖచ్చితంగా వస్తాయి. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలిస్తే లైఫ్ లో థ్రిల్ ఏం ఉంటుంది. ఇక స్టార్ డమ్ అంటారా.. అది నాకు ఎప్పుడూ ఇబ్బంది కాదు. అది మన ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుంది.

ప్ర) శ్రీకాంత్ తో మీకున్న అనుబంధం ఎలాంటిది ?
జ) శ్రీకాంత్ నాకు తమ్ముడి లాంటి వాడు. చాలా మంచివాడు. వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాల్లో కలిసి నటించాం. అతనంటే నాకు బాగా ఇష్టం. ఆయన కొడుకు రోషన్ కూడా అతనిలాగే మంచివాడు. మంచి టాలెంట్ ఉన్నవాడు.

ప్ర) ఫైనల్ గా నాగ చైతన్య, అఖిల్ పెళ్లి గురించి చెప్తారా ?

జ) ఇప్పుడు చెప్పను. దానికంటూ ఓ మంచి సందర్భం చూసి ప్రెస్ మీట్ పెట్టి స్పెషల్ గా మాట్లాడతా. అంత మంచి హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ మాట్లాడుకోవాలి కదా అందుకని.

 
Like us on Facebook