ఇంటర్వ్యూ : నాని – ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం కూడా అదృష్టంగా భావిస్తా!


వరుస విజయాలతో తిరుగన్నదే లేకుండా దూసుకుపోతోన్న హీరో నాని, ఇప్పుడు తెలుగు సినిమాకు కొత్తగా అవతరించిన ఓ స్టార్. ఆయన హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఈ శుక్రవారం (ఫిబ్రవరి 3న) భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి నానితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘నేను లోకల్’ అంటూ వచ్చేస్తున్నారు. టైటిల్ చూస్తే మాసీగా ఉంది. ఇది మాస్ ఎంటర్‌టైనరా?

స) ‘నేను లోకల్’ మాస్ ఎంటర్‌టైనర్ కాదు. పక్కా తెలుగు సినిమా లవ్‌స్టోరీ. బాగా ఆటిట్యూడ్ ఉన్న బాబు అనే ఒకడు ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ లవ్‌స్టోరీ ఏమైందన్నదే సినిమా.

ప్రశ్న) ‘నేను లోకల్’ అన్న టైటిల్ పెట్టడానికి కారణం?

స) ప్రీ క్లైమాక్స్‌లో టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ లోకల్ అన్న పాయింట్ మీరన్నట్టు ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్. టైటిల్ అలా ఎందుకు పెట్టామన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

ప్రశ్న) వరుసగా లవ్‌స్టోరీస్ మాత్రమే చేస్తున్నారు. ఎందుకని?

స) లవ్‌స్టోరీ లేని మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమాను చూపించండీ? ‘భలే భలే మగాడివోయ్’ నుంచి ‘నేను లోకల్’ వరకూ అన్నీ కొత్తదనమున్న కథలే ఎంచుకుంటూ వస్తున్నా. ఆ కథల్లో లవ్ అనేది ఒక పార్ట్‌గా ఉంటూ వస్తుందంతే!

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) పక్కా ఆటిట్యూడ్ ఉండి, ఎవరెన్ని చెప్పినా, తాను అనుకున్నది చేసే ఓ కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. బాబు అన్న ఈ స్టూడెంట్ రోల్‌కు యూత్ అంతా కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) నిర్మాత దిల్‌రాజుతో పనిచేయడం గురించి చెప్పండి?

స) దిల్‌రాజు గారితో నేను ఎప్పుడో సినిమా చేయాల్సింది. నా రెండో సినిమా అప్పట్నుంచి ఆయన నాకు చాలా కథలు తీసుకొచ్చి వినిపించారు. ఎందుకో మా కాంబినేషన్ కుదిరేది కాదు. దిల్‌రాజు సినిమా కాదంటే ఎలా? అంటూ సన్నిహితులు హెచ్చరించేవారు కూడా. మేమిద్దరం చాలాసార్లు అనుకున్నాం ఎలాగైనా ఒక సినిమా చేయాలని. నేను లోకల్‌తో అన్నీ కుదిరి దిల్‌రాజు గారితో పనిచేసే అవకాశం దక్కింది.

ప్రశ్న) దర్శకుడు త్రినాథ రావు నక్కిన గురించి చెప్పండి?

స) త్రినాథరావుకు ఈ తరహా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో మంచి పట్టుందనిపించింది. రైటర్ ప్రసన్నకుమార్‌తో త్రినాథరావు కలిశారంటే ఇద్దరూ కలిసి మ్యాజిక్ చేసేస్తారు. నేను లోకల్ అంతా సరదాగా సాగిపోవడంలో వీరిద్దరి కాంబినేషనే ప్రధాన కారణం అని చెప్పగలను.

ప్రశ్న) దేవిశ్రీ ప్రసాద్ మీ సినిమాకు పనిచేయడం ఇదే మొదటిసారి. దానిగురించి చెప్పండి?

స) దేవికి నా సినిమాలంటే ఇష్టం, నాకు దేవి మ్యూజిక్ అంటే ఇష్టం. మా కాంబినేషన్‌లో ఓ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలాసార్లే ఎదురుచూశా. చివరకు నేను లోకల్‌తో అది సాధ్యమైంది. సినిమా విడుదలకు ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయంటే ఆ క్రెడిట్ పూర్తిగా దేవీకే దక్కాలి.

ప్రశ్న) డిసెంబర్‌లో రావాల్సిన సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. రీ షూట్ చేయడం వల్లనే ఆలస్యమైందని వచ్చిన వార్తల గురించి ఏమంటారు?

స) రీ షూట్ చేసినట్లు వచ్చిన వార్తలన్నీ పుకార్లే! హీరోయిన్ కీర్తి సురేష్ డేట్స్ కుదరకపోవడం వల్లే డిసెంబర్‌లో అనుకున్న టైమ్‌కి రాలేకపోయాం. ఆ తర్వాత మాకు కనిపించిన పర్ఫెక్ట్ డేట్ ఇదే కాబట్టి ఇప్పుడొస్తున్నాం.

ప్రశ్న) వరుస విజయాలతో నాని సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అన్న పేరొచ్చింది. ఎలా అనిపిస్తోంది?

స) మినిమమ్ గ్యారంటీ అన్న పేరు రావడమన్నది సంతోషించదగ్గ విషయం. ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, సినిమాను నమ్ముకున్న అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందంటే అంతకంటే కోరుకునేది ఇంకేముండదు. నా దృష్టిలో అదే పెద్ద సక్సెస్.

ప్రశ్న) హీరోగా ఇప్పుడొచ్చిన ఈ పేరు వల్ల కథల ఎంపికలో, మీలో ఏమైనా మార్పులొచ్చాయా?

స) అస్సల్లేదు. ఎప్పుడైనా ఓ కథను నమ్మే నేను సినిమాను ఒప్పుకున్నా. అందులో కొన్ని ఆడలేదు. అలాగే ఇప్పుడు సక్సెస్ వచ్చాక నా ప్రవర్తనలోనూ ఎటువంటి మార్పూ లేదు.

ప్రశ్న) ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తోంది.

స) నన్నడిగితే బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడమే ఒక అదృష్టం. ఇప్పుడెవరైనా వచ్చి ‘నేను మీ ఫ్యాన్‌ని’ అని చెబితే అతడు కచ్చితంగా నాకు మాత్రమే ఫ్యాన్ అయి ఉంటాడు. ఆ ఆలోచనే నాకు ఉత్సాహాన్నిస్తుంది.

ప్రశ్న) తదుపరి సినిమాలేంటి?

స) ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నా. శివ నిర్వాణా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నేను, ఆది, నివేదా థామస్ లీడ్ రోల్స్ చేస్తున్నాం. ఈ వారం నుంచే యూఎస్‌లో ఈ సినిమాకు సంబంధించి ఒక నెల రోజుల షెడ్యూల్ ఉంది. ఇప్పుడు ‘నేను లోకల్’ సినిమా నేను యూఎస్‌లోనే చూడబోతున్నా.