
నవీన చంద్ర.. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో, తన మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ వెళుతోన్న నవీన్ నటించిన తాజా సినిమా ‘త్రిపుర’ ఈ వారమే విడుదల కానుంది. స్వాతి మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నవీన్ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆ విశేషాలు..
ప్రశ్న) ‘త్రిపుర’ అంటూ హర్రర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
స) ‘త్రిపుర’ ఒక ఔట్ అండ్ ఔట్ హర్రర్ థ్రిల్లర్. స్క్రీన్‌ప్లే మేజర్ హైలైట్‍గా నడిచే ఈ సినిమాలో తర్వాత జరగబోయే సన్నివేశం ఏంటన్నది ఎవ్వరూ ఊహించలేరు. ఆ థ్రిల్స్, సస్పెన్స్‌ను చూసి ఎంజాయ్ చేయాల్సిందే! ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీలయ్యే కథనంతో త్రిపుర ఉంటుంది.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?
స) ఈ సినిమాలో నేను నవీన్ చంద్ర అనే ఓ సైకియాట్రిస్ట్‌గా కనిపిస్తా. చాలా రకాల షేడ్స్ ఉన్న నా పాత్రకు సినిమా గమనంలో మంచి ప్రాధాన్యత ఉంది. అందాల రాక్షసి తర్వాత అందరూ నన్ను ‘అందాల రాక్షసి హీరో’ అనే గుర్తుంచుకున్నారు. త్రిపుర నాకు మరో కొత్త గుర్తింపునిచ్చే సినిమా. నటుడిగా నా స్థాయిని పెంచే సినిమాగా త్రిపుర నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను.
ప్రశ్న) హర్రర్ జానర్ సినిమా అనగానే కెరీర్ రిస్క్ అనే అభిప్రాయం ఉంది. దీనిపై మీరేమంటారు?
స) హర్రర్ జానర్ సినిమా చేయడం కెరీర్‌కి రిస్క్ అని చాలామంది అంటూంటారు. నన్నడిగితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే చెప్తా. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హర్రర్ సినిమాలను విపరీతంగా చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో హిట్ అయిన సినిమాల్లో చాలావరకూ ఆ కోవలో వచ్చినవే! కాబట్టి త్రిపుర కెరీర్, మార్కెట్ పరంగా కచ్చితంగా నాకు హెల్ప్ అయ్యే సినిమాయే!
ప్రశ్న) ‘గీతాంజలి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజ్ కిరణ్ రెండో సినిమా ‘త్రిపుర’. ఆయనతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
స) రాజ్ కిరణ్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. తన మొదటి సినిమా గీతాంజలి చూస్తే దర్శకుడిగా ఏయే అంశాలు ప్రేక్షకుడిని ఎగ్జైట్ చేస్తాయనే విషయాన్ని ఎంత తెలివిగా పట్టుకున్నాడో కదా అనిపిస్తూంటుంది. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే అందించిన కోన వెంకట్, సినిమాటోగ్రాఫర్ రవిశంకర్ లాంటి టాలెంటెడ్ వ్యక్తులతో కలిసి ఒక థ్రిల్లింగ్ సినిమాను అందించడంలో రాజ్ కిరణ్ పూర్తి సక్సెస్ సాధించాడనే చెప్తా.
ప్రశ్న) అందాల రాక్షసి తర్వాత తెలుగులో మళ్ళీ మీదైన మార్క్ చూపలేకపోయినట్టు కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు?
స) అందాల రాక్షసి తర్వాత నేను తెలుగులో చేసిన సినిమాలు అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఆ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేశా. అయితే సినిమాలు అనుకున్నంతగా రీచ్ కాకపోవడంతో ఇప్పటికీ అందాల రాక్షసి హీరోగానే గుర్తుండిపోయా. ఇకపోతే, త్రిపుర మాత్రం మళ్ళీ నా కెరీర్‌కి తెలుగులో కొత్త ఊపునిస్తుందని అనుకుంటున్నా.
ప్రశ్న) ఎలాంటి తరహా పాత్రలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? నెగెటివ్ రోల్ వస్తే చేస్తారా?
స) ఇలాంటి పాత్రలే చేయాలని నేను ఎప్పుడూ గిరిగీసుకొని చేయలేదు. నన్ను ఎగ్జైట్ చేసే పాత్ర ఏదైనా చేస్తా. నన్ను ఎగ్జైట్ చేయాలే గానీ, అది నెగెటివ్ రోల్ అయినే చేసేస్తా.
ప్రశ్న) తదుపరి సినిమా విశేషాలేంటి?
‘అందాల రాక్షసి’ సినిమాతో పాపులర్ అయిన నాది, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే సినిమా పూర్తైంది. త్రిపుర, లచ్చిందేవికి ఓ లెక్కుంది.. ఈ రెండు సినిమాల ఆడియో లాంచ్ ఒకే నెలలో జరిగాయి. ఈ నెల్లో త్రిపుర, వచ్చే నెలలో లచ్చిందేవికి ఓ లెక్కుంది విడుదలవుతున్నాయి. చెప్పాలంటే.. రెండు వేర్వేరు కథాంశాలతో నడిచే సినిమాలు ఈ టైంలో, ఇలా ఒకే నెల తేడాలో రిలీజ్ అవ్వడం తెలుగులో మళ్ళీ నా టైం వచ్చిందన్న విషయాన్ని సూచిస్తున్నాయి.