ఇంటర్వ్యూ : పా రంజిత్ – రజనీ సారే స్వయంగా పిలిచి సినిమా చేద్దామన్నారు!

ఇంటర్వ్యూ : పా రంజిత్ – రజనీ సారే స్వయంగా పిలిచి సినిమా చేద్దామన్నారు!

Published on Jun 26, 2016 7:43 PM IST

pa-ranjit
‘అట్టకత్తి’, ‘మద్రాస్’.. రెండే రెండు సినిమాలతో తమిళనాట తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు పా రంజిత్, మూడో సినిమాగా రజనీని డైరెక్ట్ చేసే అవకాశం పొందినప్పుడు ఒక్కసారే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయారు. రజనీతో రంజిత్ ఎలాంటి సినిమా తీస్తారా అని ఎదురుచూస్తుండగా, కబాలి అంటూ అదిరిపోయే గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. టీజర్, ఆడియోతో అంతటా ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు తెలుగు వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ జరగనున్న సందర్భంగా హైద్రాబాద్ వచ్చిన రంజిత్, మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ప్రశ్న) సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చింది?

స) తమిళంలో నేను డైరెక్ట్ చేసిన ‘మద్రాస్’ అనే సినిమా రజనీ సార్ రెండు, మూడు సార్లు చూశారట. ఆ సినిమా బాగా నచ్చి ఆయనే స్వయంగా పిలిచి ఓ సినిమా చేద్దామన్నారు.

ప్రశ్న) రజనీ లాంటి సూపర్ స్టార్ స్వయంగా పిలిచి సినిమా చేద్దాం అన్నపుడు ఎలా ఫీలయ్యారు?

స) నిజం చెప్పాలంటే నాకు మొదట భయమేసింది. రజనీ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా అంటే మాటలు కాదు కదా! కొద్దిరోజుల్లో ఆయన్ను మళ్ళీ కలిసి నేను అప్పటికే రాసుకున్న ‘కబాలి’ కథ వినిపించా. గంటన్నర పాటు ఈ కథ విని వెంటనే ‘మనం ఇదే సినిమా చేస్తున్నాం’ అని ఒక్కటే మాటన్నారు. ఆరోజు నా ఆనందానికి అవధుల్లేవు.

ప్రశ్న) రజనీకాంత్‌తో సెట్స్‌లో పనిచేయడం ఎలా ఉండేది?

స) రజనీ సార్ అద్భుతమైన నటుడు. ఆయన ఏదైనా చేస్తూంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నన్నడిగితే ఈ సినిమాలో ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెబుతా. సూపర్ స్టార్ అయి ఉండి కూడా నాలాంటి చిన్న డైరెక్టర్‌కి ఇచ్చే విలువ చూస్తే ఆయనెంత గొప్ప వ్యక్తో అర్థమవుతుంది.

ప్రశ్న) ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సినిమా గురించి చర్చ జరుగుతూండడం చూస్తే ఎలా అనిపిస్తుంది?

స) నిజంగానే ఎక్కడికెళ్ళినా ‘కబాలి కబాలి..’ అనడం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని నేనూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ‘కబాలి’ విషయంలో చూపిస్తోన్న ప్రేమను మర్చిపోలేను. రేపు సినిమా విడుదలయ్యాక అందరినీ సంతృప్తి పరుస్తామన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) ‘కబాలి’ అంటే ఏంటి? ‘కబాలి’ సినిమా కథ ఏంటి?

స) ‘కబాలి’ అని మామూలుగా గ్యాంగ్‍స్టర్స్‌ని పిలుస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాకు ‘కబాలి’ అని పేరు పెట్టా. మలేషియా నేపథ్యంలో ఒక గ్యాంగ్‌స్టర్ జీవితం చుట్టూ తిరిగే కథే ఈ కబాలి. ఇక అంతకుమించి ఈ కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.

ప్రశ్న) సినిమా ఎలా వచ్చింది? రజనీకాంత్ ఔట్‌పుట్ చూశారా?

స) సినిమా చాలా బాగా వచ్చింది. రజనీకాంత్ ఇప్పటికే ఔట్‌పుట్ చూసి మెచ్చుకున్నారు. మా అందరికీ సినిమాపై మంచి నమ్మకం ఉంది.

ప్రశ్న) ఇంతకీ విడుదల తేదీని కూడా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు విడుదలవుతోందీ?

స) ఈ వారమే విడుదల తేదీ ప్రకటిస్తాం. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. సెన్సార్ అయ్యేంతవరకూ విడుదల తేదీని ప్రకటించదల్చుకోలేదు.

ప్రశ్న) తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? తదుపరి సినిమా ఏంటి?

స) మా సినిమాను ఇంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. రేపు సినిమా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా. ఇక నా నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, హీరో సూర్యతో తెలుగు, తమిళంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు