ఇంటర్వ్యూ : పూరీ జగన్నాథ్ – నా దగ్గర మరో పదేళ్ళకు సరిపడా కథలున్నాయి!

ఇంటర్వ్యూ : పూరీ జగన్నాథ్ – నా దగ్గర మరో పదేళ్ళకు సరిపడా కథలున్నాయి!

Published on Oct 19, 2016 4:27 PM IST

puri
తెలుగులో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలంటే పడి చచ్చే అభిమానులున్నారు. మళ్ళీ మళ్ళీ చూడదగ్గ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన పూరీకి, హీరోలను కొత్తగా పరిచయం చేయడం, ఇంటెన్సిటీ ఉన్న డైలాగులు రాయడం లాంటివి ఒక అలవాటుగా మారిపోయాయి. ఇక తాజాగా ఆయన తన స్టైల్లో హీరో కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించిన ‘ఇజం’ అనే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి పూరీ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ‘ఇజం’ సినిమా ఏం చెప్పబోతోంది?

స) సింపుల్‌గా చెప్పాలంటే అవినీతిపై ఓ జర్నలిస్ట్ చేసే పోరాటమే ‘ఇజం’. ఈ కథను పదేళ్ళ క్రితమే రాశా. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఆ కథలో మార్పులు చేసి ఇప్పటికి సినిమాగా తీసుకొచ్చా.

ప్రశ్న) గతంలో మీరే ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ సినిమాలో అవినీతి గురించి ప్రస్తావించారు. ఇప్పుడు మళ్ళీ అదే అవినీతిపై కొత్తగా ఏం చెబుతున్నారు?

స) ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’కి, ఈ సినిమాకు ఎక్కడా సంబంధం ఉండదు. నన్నడిగితే అవినీతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇదే విషయాన్ని మరోసారి కొత్త కోణంలో చెప్పా. అదేంటన్నది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.

ప్రశ్న) కళ్యాణ్ రామ్ రోల్ గురించి చెప్పండి?

స) కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. నిజ జీవితంలోనూ చాలా నిజాయితీగా ఉంటారాయన. దీంతో ఆయనతోనే ఈ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నా. ఇజంలో కళ్యాణ్ రామ్ చాలా బాగా నటించారు. ఇందులో ఆయన నటనకు ఈ సంవత్సరానికి బెస్ట్ యాక్టర్‌గా అవార్డులన్నీ వస్తాయనుకుంటున్నా.

ప్రశ్న) కళ్యాణ్ రామ్‍ను సిక్స్‌ప్యాక్‍లో చూపించాలన్న ఆలోచన ఎవరిది?

స) కళ్యాణ్ రామ్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించాలన్నది నా ఆలోచనే. పాత్ర అవసరానికి తగ్గట్టు సమాజం గురించి ఎంతో ఆలోచించే వ్యక్తి, తానూ స్వయంగా ఫిట్‌గా ఉండాలనే అలా చేశా. ఈ లుక్ కోసం కళ్యాణ్ రామ్ మూడు నెలల పాటు నిరంతరం కష్టపడ్డారు.

ప్రశ్న) మీ సినిమాలన్నింటిలోనూ సోషల్ కనెక్ట్ ఉండేలా చూసుకుంటారు ఎందుకని?

స) ఇప్పుడు సొసైటీ పూర్తిగా మారిపోయింది. అవినీతి లాంటివి మన జీవితాల్లోకి పూర్తిగా వచ్చేశాయి. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడే రకరకాల ఆలోచనలు కలిగి, నిజ జీవితాలను ప్రేరణగా తీసుకొని కథలు రాస్తూంటా. ఇజం కూడా అలా పుట్టిన కథే!

ప్రశ్న) హీరోయిన్ అదితి ఆర్య గురించి చెప్పండి?

స) అదితి ఆర్య గతంలో మిస్ ఇండియాగా ఎంపికైన అమ్మాయి. ఇజంలో ఓ బలమైన పాత్రలో అదితి చాలా బాగా నటించింది.

ప్రశ్న) ఈ సినిమాలో ఓ పాట రాయడంతో పాటు పాడారు కూడా?

స) అది అనూప్ ఆలోచనే! ఇజం అనే పాట నేనే పాడితే బాగుంటుందని పాడించేశాడు.

ప్రశ్న) మహేష్‌తో సినిమా ఏమైంది?

స) మహేష్‌కు ఇప్పటికే ఓ స్క్రిప్ట్ వినిపించా, అది ఓకే అయింది కూడా. అయితే ఆ తర్వాత మహేష్ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నేను ఆయన రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నా.

ప్రశ్న) రోగ్ సినిమా ఎంతవరకొచ్చింది?

స) ఆ సినిమా కూడా షూటింగ్ మొత్తం పూర్తైంది. డిసెంబర్ నెలలో అది విడుదలవుతుంది.

ప్రశ్న) మీకు కథా ఆలోచనలు ఎలా పుడుతుంటాయి?

స) రోజూ సొసైటీని చూస్తూ ఉంటే అవే వచ్చేస్తూంటాయి. ఒక ఐడియా రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాసేస్తుంటా. నా దగ్గర మరో పదేళ్ళకు సరిపడా కథలున్నాయి.

ప్రశ్న) మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి?

స) ఇప్పటికే అందరు స్టార్స్‌తో సినిమాలు చేసేశా. ఇండియన్, హాలీవుడ్ స్టార్స్‌ని కలిపి ఒక సినిమా చేయాలన్న కోరిక ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు