ఇంటర్వ్యూ : రాజమౌళి – అభిమానుల కోసమే భారీ ఎత్తున ఆడియో రిలీజ్!

rajamouli33
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక వాయిదా పడింది. హైద్రాబాద్‌లోని హైటెక్స్‌ ఓపెన్ గ్రౌండ్స్‌లో మే 31న అభిమానుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో పోలీసులు కొన్ని పరమితులు విధించడంతో ఆడియో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇదే విషయమై దర్శకుడు రాజమౌళి మీడియాతో పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) ‘బాహుబలి’ ఆడియో రిలీజ్‌ను సడెన్‌గా వాయిదా వేశారేం?

స) బాహుబలి ఆడియో రిలీజ్ కోసం అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకున్నాక, పోలీసుల వద్దనుంచి నిన్నే ఓ వార్త వచ్చింది. వారికున్న పరిమితుల మేరకు చాలా తక్కువ మందికి మాత్రమే అనుమతిని ఇవ్వగలమనేది దాని సారాంశం. ఈ సినిమా కోసం, ప్రభాస్ కోసం ఎప్పట్నుంచో అభిమానులు ఎదురుచూస్తూ ఉండడంతో, మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనం వస్తారని సమాచారం రావడంతో రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు. ఈ సాయంత్రం గానీ, రేపు గానీ కొత్త ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం.

ప్రశ్న) పోలీసులు అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణం?

స) పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమనే సమస్యే లేదిక్కడ. వారికున్న పరిమితిని బట్టి 25వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అదే జరిగితే అభిమానులు బారికేడ్ల బయట ఎదురుచూడాల్సి ఉంటుంది. అది మాకేమాత్రం ఇష్టం లేదు. రెండేళ్ళుగా ఎదురుచూస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఆడియో ఈవెంట్ ఫెయిలైనట్టే! అదీగాక గతంలో రెండు మూడు సినిమా ఫంక్షన్ల విషయంలో కొన్ని బాధాకర సంఘటనలు జరిగాయి. అలాంటివి మళ్ళీ జరగకూడదనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము కూడా అభిమానుల సేఫ్టీ గురించి ఆలోచించి ఈ రిలీజ్‌ను వాయిదా వేశాం.

ప్రశ్న) ‘బాహుబలి’కి ఇప్పటికే భారీ క్రేజ్ ఉండగా, ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కూడా ఈ రేంజ్‌లో చేయాల్సిన అవసరం ఏముంది?

స) ‘బాహుబలి’కి ఇప్పటికే దేశావ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మాట నిజమే. ఈ ఆడియో రిలీజ్‌ను ఈ స్థాయిలో చేయడం ద్వారా బాహుబలికి కొత్తగా వచ్చే హైప్ కూడా ఏమీలేదు. అయినా సరే ఈ స్థాయిలో ఆడియో రిలీజ్ చేస్తున్నామంటే అది అభిమానుల కోసమే! ప్రభాస్ కోసం రెండేళ్ళుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఏదో చిన్న ఫంక్షన్ చేసి సరిపెట్టలేం.

ప్రశ్న) ఆడియోతో పాటు ట్రైలర్ కూడా వాయిదా పడ్డట్టేనా?

స) నిజానికి ట్రైలర్ రిలీజ్ కోసం మేము ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాం. ఆడియో ఫంక్షన్‌లో ఏ టైమ్‌కి, ఏ స్టైల్లో ట్రైలర్ రిలీజ్ చేయాలనేది పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ విషయమై ఇంకా ఏదీ ఆలోచించలేదు. ఈ సాయంత్రానికల్లా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది తెలియజేస్తాం.

ప్రశ్న) ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ ఆడియో విడుదల కానుందా?

స) లేదు. అన్ని భాషల్లో వేర్వేరుగా గ్రాండ్‌గా చేసేందుకే తమిళ, హిందీ పంపిణీదారులు ఇష్టపడుతున్నారు. జూన్ ఒకటిన బాహుబలి హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో జరగనుంది. మే 31న ఉదయం ఓ పెద్ద ప్రెస్‌మీట్, మే 31న సాయంత్రం హైటెక్స్‌లో గ్రాండ్‌గా ఆడియో రిలీజ్, ఆ తర్వాత జూన్ 1న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం.. ఇలా అన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు అంతా మారిపోయింది. హిందీ ట్రైలర్ లాంచ్ మాత్రం తప్పకుండా ఉంటుంది.

ప్రశ్న) ‘బాహుబలి ది బిగినింగ్’ ఎంతవరకు వచ్చింది?

స) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. రీ రికార్డింగ్ 90% పూర్తైంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేస్తున్నాం. ‘బాహుబలి ది బిగినింగ్’ నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉంటుంది.

ప్రశ్న) ‘బాహుబలి పార్ట్ 2’ షూటింగ్ ఎంతవరకు పూర్తైంది?

స) ‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ 70% పూర్తైంది. పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 2కి సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తాం.

Exit mobile version