ఇంటర్వ్యూ : సుమంత్ – ‘నరుడా డోనరుడా’ ‘A’ సర్టిఫికెట్ సినిమా కాదు!
Published on Nov 2, 2016 2:19 pm IST

sumanth
2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని హీరో సుమంత్ ‘నరుడా డోనరుడా’ అనే సినిమాతో వచ్చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాకు రీమేకే ఈ ‘నరుడా డోనరుడా’! ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో ఎక్కడిలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సుమంత్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు ఎందుకని?

స) కావాలనే ఏం గ్యాప్ తీసుకోలేదు. నాకు పక్కా కమర్షియల్ సినిమాలు చేయడం నచ్చదు. అలా నాకు సూటయ్యే సినిమా చేద్దాం అనుకున్నప్పుడే ‘విక్కీ డోనార్’ రీమేక్ కనిపించింది. అయితే తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చనిపోవడంతో కొన్నాళ్ళు ఖాళీగా కూర్చున్నా. అప్పటికే విక్కీ డోనార్ రీమేక్ హక్కులు ఎవరో తీసుకున్నట్లు కూడా తెలిసింది. ఇక అప్పట్లో దాని పక్కనపెట్టేసి అలాంటి సరికొత్త కథల కోసం ఎదురుచూశా.

ప్రశ్న) మరి మళ్ళీ విక్కీ డోనార్ రీమేక్ మీదగ్గరకు ఎలా వచ్చింది?

స) నిజానికి విక్కీ డోనార్ హక్కులు ఎవ్వరూ కొనలేదట. అదంతా పుకారే అని ఆ సినిమా ప్రొడ్యూసర్ జాన్ అబ్రహంని సంప్రదిస్తే తెలిసింది. జాన్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నేనడగగానే రీమేక్ హక్కులు ఇచ్చేశాడు. విక్కీ డోనార్‌లో ఓ బలమైన ఎమోషన్‌తో పాటు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంది. అది నచ్చే ఈ రీమేక్ చేశా.

ప్రశ్న) ట్రైలర్, పోస్టర్స్‌తోనే సినిమా బోల్డ్ అని తెల్చేశారు. బాలీవుడ్‌లోలా ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారో లేదోనన్న భయం లేదా?

స) అలాంటి భయం ఎప్పుడూ లేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ఇంకా చెప్పాలంటే ఇది బాలీవుడ్‌లో ఒక్క మల్టీప్లెక్స్ సినిమాగా మాత్రమే కాక అంతటా ఆడింది. ఇక్కడా అలాగే అందరూ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. విక్కీ డోనార్ కంటే ఈ సినిమా ఇంకా బోల్డ్‌గా ఉంటుంది.

ప్రశ్న) పోస్టర్స్ చూస్తే కాస్త అడల్ట్ కంటెంట్‌లా కనిపిస్తోంది. దాని గురించి చెప్పండి?

స) ఇది పక్కాగా అందరూ చూసే సినిమా. బోల్డ్‌గా ఉంటుంది కానీ, ఎక్కడా వల్గారిటీ, అడల్ట్ కంటెంట్ ఉండదు. సెన్సార్ వాళ్ళు కూడా యూ/ఏ రేటింగ్ ఇచ్చారు. ఇది హాట్ సినిమానో, ఏ రేటెడ్ సినిమానో అయితే కాదు.

ప్రశ్న) మీరే ప్రొడక్షన్ దగ్గరుండి చూసుకున్నారు కదా? ఆ అనుభవం ఎలా ఉంది?

స) నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేను, తనికెళ్ళ భరణి గారు తప్ప మిగతా అందరూ కొత్తవారే! వాళ్ళందరినీ ఒక టీమ్‍గా చేసుకొని, ప్రొడక్షన్ చేయడం పెద్ద బాధ్యతలాగే కనిపించింది. ప్రొడ్యూసర్స్‌పై మరింత గౌరవం పెరిగింది.

ప్రశ్న) బాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థాయి తెచ్చుకున్న సినిమాను కొత్తవాళ్ళతో చేయాలని ఎందుకనిపించింది?

స) ఫ్రెష్‌గా ఉంటుంది, ఫ్రెష్ ఐడియాలతో వస్తారని అంతా కొత్త టెక్నీషియన్స్, టీమ్‌తో సినిమా చేశాం. దర్శకుడు మల్లిక్ దగ్గర్నుంచి అందరూ తమ స్టాంప్ చూపించుకునేలా పనిచేశారు. ఔట్‌పుట్‌తో అందరం హ్యాపీగా ఉన్నాం.

ప్రశ్న) వ్యక్తిగత జీవితం ఎలా ఉంది. పెళ్ళి ఆలోచన ఏమైనా ఉందా?

స) అఖిల్, చైతన్యల పెళ్ళిళ్ళకు వెళ్ళడమే కానీ నేనైతే పెళ్ళి చేసుకోదల్చుకోలేదు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా! ఇలా సినిమాలు చేసుకుంటూ బాగానే ఉన్నా. అందరూ పెళ్ళి చేసుకోవాలని ఏమీ లేదు.

ప్రశ్న) తదుపరి సినిమాలేంటీ? హీరోగా మాత్రమే కాక వేరే పాత్రలేమైనా చేస్తారా?

స) తదుపరి సినిమా ఆలోచనలేవీ ఇంకా పెట్టుకోలేదు. ప్రస్తుతానికి కథలు వింటున్నా, ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి. ఇక విలన్‌గా చేయడమంటే నాకెంతో ఇష్టం. చాలాసార్లు ఇదే విషయం చెప్పినా మరి నాకైతే అలాంటి అవకాశాలేవీ రాలేదు. అలాంటి అవకాశాలే వస్తే చేయడానికి సిద్ధంగా ఉంటా.

 
Like us on Facebook