ఇంటర్వ్యూ : సూర్య – ‘ఇ.టి’ ఇప్పటి తరానికి బాగా కనెక్ట్ అవుతుంది !

ఇంటర్వ్యూ : సూర్య – ‘ఇ.టి’ ఇప్పటి తరానికి బాగా కనెక్ట్ అవుతుంది !

Published on Mar 7, 2022 3:35 PM IST

సూర్య హీరోగా వస్తున్న కొత్త సినిమా ఇ.టి. (ఎవరికీ తలవంచడు). ఈ సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. కాగా తాజాగా సూర్య విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

 

ET గురించి చెప్పండి?

ET ఇ.టి. (ఎవరికీ తలవంచడు) సినిమా యొక్క ప్రధాన అంశం సమాజంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనల నుండి తీసుకోబడింది. మా ఇంటికి బంధువులు వస్తే నీళ్లు ఇవ్వమని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అడుగుతాం. అదే విధంగా భర్తలతో ఏమైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా సర్దుకుపోవాలని భార్యలకే చెబుతుంటారు. ఇలాంటి సున్నితమైన అంశాలను దర్శకుడు సినిమాలో చేర్చాడు.

 

ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?

ఎక్కడా అనుచితమైన సన్నివేశాలు ఉండవు. ET మాస్ కమర్షియల్ అంశాలతో పాటు మహిళల గురించి బలమైన సామాజిక సందేశాన్ని కలిగి ఉంది. పాండిరాజ్ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ను, ఎమోషన్స్‌ ను చాలా బాగా చూపించాడు. ఇప్పటి తరానికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని, నా అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

 

ఈ సినిమాలో విలన్ గురించి చెప్పండి?

తెలుగులో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విలన్‌ లకు బాగా ఎలివేషన్స్ ఇస్తారు. వారిలాగే దర్శకుడు పాండిరాజ్ కూడా వినయ్ రాయ్ పోషించిన విలన్ పాత్రను ప్రత్యేకంగా మరియు శక్తివంతంగా డిజైన్ చేశారు.

 

మీరు ET తెలుగు వెర్షన్‌కి డబ్బింగ్ చెప్పారా?

అవును, ETకి నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాను. తమిళ డబ్బింగ్ కంటే తెలుగు డబ్బింగ్‌ని బాగా ఎంజాయ్ చేశాను. డైలాగులు మరింత ఆకర్షణీయంగా ఉండేలా తెలుగులో చిన్న చిన్న మార్పులు చేశాం.

 

జై భీమ్ ఆస్కార్‌కి ఎంపికైనప్పుడు మీకు ఎలా అనిపించింది?

నేను చాలా సంతోషించాను. జై భీమ్ ఆస్కార్ కి వెళ్ళింది. అవార్డు రాకపోయినా చాలా మంది సినిమాను మెచ్చుకున్నారు. దాదాపు 3,000 సినిమాలు నామినేట్ చేయబడ్డాయి. ఆస్కార్స్‌లో జ్యూరీ ద్వారా వీక్షించబడతాయి. కలకత్తా నుండి కూడా నన్ను అభినందించడానికి ఫోన్లు చేసారు.

 

ఓటీటీలో సినిమాలను విడుదల చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి?

కరోనా మహమ్మారి సమయంలో ఆ తర్వాత సినిమా రంగంలో పెను మార్పులు వచ్చాయి. ఓటీటీల రాక నిర్మాతలకు పెద్ద ఊపునిచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి తర్వాత, నా చివరి రెండు సినిమాలు, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ ఓటీటీలోనే విడుదలై ప్రశంసలు పొందాయి. పుష్ప, భీమ్లా నాయక్ చిత్రాలు కూడా థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. దాంతో సినిమాలకు పెద్ద బిజినెస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

భవిష్యత్ ప్రాజెక్టులు?

కొన్ని సినిమాలు ఉన్నాయి. దర్శకుడు బాలతో ఓ సినిమా చేస్తున్నాను. వెట్రిమారన్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నాను. జూన్‌లో ఈ సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు