Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : సూర్య – తెలుగు సినిమా చేయాలని నాకూ ఉంది..!
Published on Feb 6, 2017 3:24 pm IST


తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోల్లో ఒకరుగా దూసుకుపోతోన్న సూర్య హీరోగా నటించిన ‘సింగం 3’ ఈనెల 9న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కారణాలతో చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పటికి విడుదలకు పక్కాగా సిద్ధమైంది. ఇక ఈ సందర్భంగా హైద్రాబాద్ వచ్చిన సూర్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘సింగం 3’ ఇన్నిసార్లు వాయిదా పడడం ఇబ్బందిగా అనిపించలేదా?

స) కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. తమిళనాడులో జరిగిన పలు ఉద్యమాల కారణంగా సినిమాను వాయిదా వేశాం. జల్లికట్టును అనుమతించాలంటూ చేసిన ఆ ఉద్యమానికి నేనూ సపోర్ట్ ఇచ్చా. ఇలాంటి పోరాటాలు జరిగడం వల్లనే సినిమా వాయిదా పడింది కాబట్టి, నేనైతే ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవ్వలేదు.

ప్రశ్న) జల్లికట్టు ఉద్యమ సమయంలో పెటా (PETA)తో జరిగిన గొడవ సద్దుమణిగిందా?

స) వాళ్ళు సారీ చెప్పడంతోనే ఆ గొడవ ముగిసింది. నా సినిమా రిలీజ్ ఉండబట్టే నేను జల్లికట్టుకు మద్దతిచ్చానని పెటా ప్రచారం చేసింది. ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు సాంప్రాదాయాలను పాటించడం ఇష్టం. అందువల్లే నేను జల్లికట్టుకు మద్దతిచ్చా. దాన్ని పెట్టుకొని పెటా ఇలా ప్రచారం చేయడం తప్పనిపించింది. నోటీస్ పంపి క్షమాపణలు కోరడంతో, పెటా వెంటనే అది చేసేయడంతో గొడవ అక్కడే ముగిసింది.

ప్రశ్న) సింగం సిరీస్‌లో మూడో భాగం అయిన ‘సింగం 3’లో స్పెషల్స్ ఏంటి?

స) ‘సింగం 3’లో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఆంధ్రా, ముంబైలో జరిగిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా కొంత కథ నడుస్తుంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటర్నేషనల్ క్రైమ్‌తో ముందు రెండు సిరీస్‌లలానే ఫుల్ యాక్షన్ ఉంటుంది.

ప్రశ్న) దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో హరీస్ జైరాజ్‌ను ఎంచుకోవడం గురించి చెప్పండి?

స) నిజానికి మాకిది చాలా టఫ్ డెసిషన్. అయితే కొన్నిసార్లు సినిమా గురించే ఆలోచించాల్సి వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మాకు హరీస్ జైరాజ్ ఒక్కడే కనిపించడంతో ఆయనను తీసుకున్నాం. దేవీ కూడా మాకు సపోర్ట్‌గా నిలిచి, ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ప్రాజెక్టును వదులుకున్నాడు.

ప్రశ్న) సింగం అంటూ అదే పోలీస్ రోల్ తరచూ చేస్తూండడం బోర్ అనిపించడం లేదా?

స) నేను, దర్శకుడు హరి ఎక్కడికెళ్ళినా మమ్మల్ని సింగం సిరీస్ గురించే అడుగుతూంటారు. ‘సీక్వెల్స్ తీస్తూనే ఉండండి’ అని కూడా చెబుతూంటారు. ప్రేక్షకులు అంత బలంగా కోరుకుంటున్నప్పుడు సీక్వెల్ చేస్తూండడం తప్పనుకోను.

ప్రశ్న) శృతి హాసన్ గురించి చెప్పండి?

స) శృతి హాసన్‌కు కెరీర్‌ పరంగా ఈ సినిమాలోని రోల్ ఓ మంచి పేరు తెస్తుందనుకుంటున్నా. కథకు కీలకమైన పాత్రలో ఆమె చాలా బాగా నటించింది.

ప్రశ్న) సోషల్ మీడియాలో దోశ ఛాలెంజ్ అని పెట్టారు. దాని గురించి చెప్పండి?

స) నేనేదో సరదాగా మొదలుపెట్టిన చాలెంజ్ అది. ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుందని నేనూ ఊహించలేదు. ‘మన వాళ్ళపై మనకున్న ఇష్టాన్ని ఓ దోశ చేసి చూపించండి’ అంటూ ఇది మొదలుపెట్టా.

ప్రశ్న) మీ భార్య జ్యోతిక కెరీర్ ఎలా ఉంది?

స) వినూత్నమైన సినిమాలు చేస్తూ జ్యో అందరినీ బాగా మెప్పిస్తోంది. ఒక భర్తగా అన్నివిధాలా తనకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నా. తను ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉన్నవే!

ప్రశ్న) దర్శకుడు హరి గురించి చెప్పండి?

స) హరి అన్ని క్రాఫ్ట్‌లపై మంచి పట్టు ఉన్న దర్శకుడు. షూట్ లేనిరోజు కూడా సినిమా గురించే ఆలోచిస్తూ చాలా కష్టపడుతూంటాడు. సెట్లో అయితే 5000 మంది ఉన్నా కూడా ఒక్క సైగతో అంతా సైలెంట్ చేయగల సమర్ధుడు.

ప్రశ్న) ఒక స్ట్రైట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు కదా! అదెప్పుడు ఉంటుంది?

స) నాకూ స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ఉంది. దర్శకులెవరైనా వచ్చి మంచి స్క్రిప్ట్ చెబితే చేసేందుకు సిద్ధంగా ఉంటా. ప్రస్తుతానికైతే నేను తమిళంలో చేస్తోన్న సినిమాలన్నీ ఇక్కడా విడుదలై బాగా ఆడుతున్నాయి కాబట్టి, పెద్దగా కంప్లైంట్స్ లేవు.

ప్రశ్న) తదుపరి ప్రాజెక్టు గురించి చెప్పండి?

స) విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘తానా సెరిందా కూట్టం’ అనే సినిమా చేస్తున్నా. ఈ మధ్యే ఆ సినిమా మొదలైంది. ఇప్పుడే దాని గురించి ఇంతకంటే ఏమీ చెప్పలేను.

సంబంధిత సమాచారం :