ఇంటర్వ్యూ : తమన్నా- ‘బాహుబలి’.. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా!

tamanna-latest

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే అన్ని చోట్లా మొదలుపెట్టారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘బాహుబలి’ కథానాయిక తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘బాహుబలి’ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి?

స) ‘బాహుబలి’ గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ మిగల్లేదనుకుంటా! ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో ప్రధానంగా ఏడు పాత్రలుంటాయి. ఆ పాత్రల చుట్టూనే ఓ బలమైన కథ నడుస్తూంటుంది. పీరియడ్ సినిమా కావడంతో ఈ సినిమాలో పాత్రలన్నీ నిజ జీవిత సాధారణ పాత్రలకంటే మరింత లార్జ్‌గా కనిపిస్తూ, ప్రవర్తిస్తూ ఉంటాయి. కచ్చితంగా ఇండియన్ సినిమాలో ‘బాహుబలి’ ఓ వండర్‌గా నిలుస్తుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో నేను అవంతిక అనే యువరాణిగా కనిపిస్తా. నేనిప్పటివరకూ చేయని పాత్ర. చెప్పాలంటే మొదట్లో అంతా అయోమయంగా ఉండేది. ఒక్కసారి అంతా సెట్ అయిపోయాక ఈ సినిమా చేయడం చాలా సరదాగా ఈ క్యారెక్టర్ చేసేశా. ఇందులో యుద్ధ సన్నివేశాల్లోనూ కనిపిస్తా. ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి విలక్షణ పాత్ర దొరకడం నా అదృష్టం.

ప్రశ్న) ఈ పాత్రను రాజమౌళిని మీరే అడిగారా? ఆయనే సంప్రదించారా?

స) ఇలాంటి సినిమాలో నాకో పాత్ర ఇవ్వమని నేనెలా అడగగలనండీ (నవ్వుతూ..). ఒక దర్శకుడికి తన సినిమాలో నేను అవసరమని భావిస్తే నన్ను సంప్రదిస్తారు. ఆ విధంగా రాజమౌళి గారికి ఈ పాత్రకు నేను సెట్ అవుతానని నమ్మే ఆయన నాకీ ఆఫర్ ఇచ్చారు.

ప్రశ్న) ‘బాహుబలి’లో మీ పాత్ర కోసం ఏమేం హోమ్‌వర్క్ చేశారు?

స) ముందుగా ఈ క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడమే నా పని. ఇక నటీనటులందరికీ కొన్ని నెలల పాటు చాలా అంశాల్లో శిక్షణనిచ్చారు. షూట్‌కి ముందు కొన్ని రిహార్సల్స్ కూడా చేశాం. అన్నీ పకడ్బందీగా సెట్ అయ్యాకే సెట్స్‌పైకి వెళ్ళడంతో షూటింగ్ అప్పుడు ఏ ఇబ్బందీ పడలేదు.

ప్రశ్న) రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్‌తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?

స) రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటించడమనేది నటీనటులెవ్వరికైనా ఓ అదృష్టం లాంటిది. అలాంటిది ‘బాహుబలి’ లాంటి సినిమాలో అవకాశమంటే ఇక ఏమీ మాట్లాడలేం. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కెప్టెన్ అయినా కూడా ఆయన చాలా కూల్‌గా, ఎక్కడా కోపమనేదే తెచ్చుకోకుండా పని చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయనకేం కావాలనేదానిపై ఒక పూర్తి విజన్ ఉంటుంది. మనం ఆ విజన్‌ను అర్థం చేసుకొని ఫాలో అయిపోవడమే!

ప్రశ్న) మీ టీమ్ ప్రభాస్, రానా, నిర్మాతల దగ్గర్నుంచి సహకారం ఎలా ఉండేది?

స) ప్రభాస్, రానా, శోభు గారు ఇలా అందరూ బాహుబల్లిపై ప్రేమతో పనిచేశారు. నాకైతే ఇప్పటికీ రోజూ బాహుబలి షూటింగ్ గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో అందరం కలవడం సంతోషంగా ఉంది. శోభు గారు, ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు.

ప్రశ్న) ఇంతకీ సినిమా మొత్తం చూశారా?

స) లేదండీ. కేవలం నా పార్ట్ వరకు మాత్రమే చూశా. అది కూడా హిందీ వర్షన్ డబ్బింగ్ చెప్పేప్పుడు చూశా. చాలా నచ్చింది. ‘బాహుబలి’ అంటేనే విజువల్ వండర్. అందరిలానే సినిమా చూడడానికి నేనూ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

ప్రశ్న) ‘బాహుబలి’ మీ కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు?

స) బాహుబలి నా కెరీర్లో మరచిపోలేని సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సమయంలో నా కెరీర్లో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా, దేశ వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా రావడమనేది నా అదృష్టం. ‘పయ్యా’, ‘100% లవ్’ సినిమాల తర్వాత నాకు బాగా కనెక్ట్ సినిమా ‘బాహుబలి’.

ప్రశ్న) ‘బాహుబలి’ తర్వాత కెరీర్ ఎలా ఉంది?

స) బాహుబలి తర్వాత కెరీర్ చాలా బాగుంది. ప్రస్తుతం నాగార్జున-కార్తీల సినిమా, రవితేజ ‘బెంగాల్ టైగర్’లలో నటిస్తున్నా. మంచి సినిమాలు చేస్తూ పోవడమన్నదే నా అజెండా. అది ఏ భాషా సినిమా అని ప్రత్యేకించి చూడను.

Exit mobile version