ఇంటర్వ్యూ : వీరు పోట్ల – ‘బాహుబలి’ లాంటి సినిమాలు తీయాలనుంది !

ఇంటర్వ్యూ : వీరు పోట్ల – ‘బాహుబలి’ లాంటి సినిమాలు తీయాలనుంది !

Published on Oct 6, 2016 6:20 PM IST

veeru-potla
‘బిందాస్, దూసుకెళ్తా’ వంటి ఎంటర్టైనింగ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు వీరు పోట్ల లాంగ్ గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. హీరో సునీల్ నటించిన ఈ చిత్రం రేపు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్బంగా వీరుపోట్లతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్ర) అసలు ఈ సినిమాకి ‘ఈడు గోల్డ్ ఎహే అనే టైటిల్ ఎందుకు పెట్టారు ?
జ) అంటే కథకి, హీరో క్యారెక్టరైజేషన్ కి సరిగ్గా సరిపోతుంది కనుక ఈ టైటిల్ ని పెట్టాం. టైటిల్ లో ఉన్న ‘ఎహే’ అనే పదం బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రమే వాడుతాం. నాకు సునీల్ బాగా కావలసిన వాడు. మా ఇద్దరికీ మధ్య ఓ క్లోజ్ నెస్ ఉంటుంది. అందుకే ఈ పేరు పెట్టాను.

ప్ర) సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ?
జ) ఇందులో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. పరిస్థితిని బట్టి ఒక పాత్ర నుండి మరో పాత్రలోకి మారుతూ ఉంటాడు. రెండు వేరియేషన్లలోనూ ఎనర్టైన్మెంట్ ఉంటుంది. సునీల్ నుండి అందరూ కోరుకునే కామెడీని సినిమాలో ఎక్కడా మిస్సవదు.

ప్ర) మీ ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏమన్నా ఉందా ?
జ) తేడా ఉంది. నా ముందు సినిమాలన్నీ కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఎంటర్టైనర్లే. కానీ ఈ సినిమాలో మాత్రం ఎంటర్టైన్మెంట్ తో పాటు థ్రిల్ కూడా ఉంటుంది. ప్రేక్షకుడు కథలో ముందు ముందు ఏం జరుగుతుందో ఊహించలేడు. మొదటి నుండి చివరి వరకూ సరదాగా సాగిపోతుంది. ఇందులో కథను ట్రీట్ చేసిన విధానం కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ప్ర) ‘దూసుకెళ్తా’ సినిమా తరువాత ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది ?
జ) నిజంగా ఈ గ్యాప్ ఎందుకొచ్చిందో నాక్కూడా తెలీదు. మనం గతంలో ఎన్ని హిట్ సినిమాలకి రైటర్లుగా పనిచేసినా, డైరెక్టర్ గా ఎన్ని హిట్ సినిమాలు తీసినా మన చివరి సినిమా ఎలా ఆడింది అనే దాన్నే అందరూ చూస్తారు. అది బాగా ఆడితే త్వరగా ఛాన్సులొస్తాయి. పైగా చాలా మంది హీరోలు ముందు చేస్తామని చెప్పి తరువాత తప్పించుకున్నారు కూడ.

ప్ర) ఈ సినిమాకంటే ముందు మల్టీ స్టారర్ తీద్దామనుకున్నారు కదా. ఏమైంది ?
జ) అవును. ఈ సినిమా కంటే ముందు రవితేజ, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ తీద్దామనుకున్నా. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నా. కానీ టైం సరిగ్గా కుదరక అది వర్కవుట్ కాలేదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ముందు ఏం జరుగుతుందో ఊహించలేం కదా. అందుకే ఆ సినిమా జరగలేదు. తరువాత కొత్తగా మళ్ళీ స్క్రిప్ట్ రాసుకుని ఈ సినిమా తీశా.

ప్ర) డిఫరెంట్ సినిమాలు తీయాలని ఎప్పుడైనా అనిపించిందా ?
జ) అవును. నేను డిఫరెంట్ సినిమాలు తీయాలనే అనుకుంటున్నా. ఒకసారి ఓ హీరోకి సర్ మనము డిఫరెంట్ గా, కొత్తగా ఉండే సినిమా తీద్దామని అన్నాను. కానీ ఆయన అవన్నీ ఎందుకు మీ పాత ఫార్ములాలోనే సేఫ్ గా ఓ సినిమా చేసేద్దాం అన్నారు. మళ్ళీ నేనే ఎలాంటి కథ చెబుతానో, డిఫరెంట్ అని అంటానో అని ఆయన ఫోన్ కూడా ఎత్తలేదు.

ప్ర) డిఫరెంట్ సినిమా అంటే ఎలాంటివి ?
జ) నాకు రాజమౌళి గారిలా ‘బాహుబలి’ లాంటి సినిమా తీయాలనుంది. పిరియాడికల్ గా వేరే కాలానికి వెళ్ళిపోయినట్టుండే సినిమాలు తీయాలని కోరిక.

ప్ర) మీరు వేరే సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటారా ?
జ) అవును. నేను చూసిన సినిమాల్లో కొన్ని నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. అలాగని కాపీ కొట్టడం చేయను. వాటి నుండి ఎంతో కొంత నేర్చుకుని నా సినిమాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. అన్ని సినిమాల్లోనూ హీరో విలన్ ని ఓడించడం అనే పాయింట్ కామన్. కానీ ఆ అంశాన్ని ఎలా ట్రీట్ చేశాం, అందులో కొత్తదనమేమన్నా చూపించామా అన్నదే ముఖ్యం. మన ముందు చేసిన వాళ్ళను చూసి నేర్చుకోకపోతే ఫూల్ అవుతాం. నా వరకూ నేను వీరు పోట్ల సినిమాలు కాపీ కొడతాడు అని అనిపించుకోకూడదనే అనుకుంటాను.

ప్ర) మీ సినిమాల్లో ఎప్పుడూ ఉండే బెస్ట్ క్వాలిటీ ఏమిటి ?
జ) నాలో, నా సినిమాల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అంటే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం. దాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోను. ఎవరైనా సరే వాళ్లలో ఉండే బెస్ట్ క్వాలిటీని ఎప్పటికీ వదులుకోకూడదు. అదే మంచిది. నేను కూడా అంతే. నా కమర్షియల్ వాల్యూస్ ని అస్సలు వదలను.

ప్ర) ఇకపై కూడా సునీల్ గారితో సినిమాలు చేస్తారా ?
జ) సునీల్ నాకు మంచి ఫ్రెండ్. అలాగే నిర్మాత అనిల్ సుంకరగారు కూడా ‘బిందాస్’ సినిమా ముందు నుండి నాకు స్నేహితుడే. మా కాంబినేషన్లో ఇకపై కూడా సినిమాలు వస్తూనే ఉంటాయి.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు