‘పురచ్చి తలైవి’ జయలలిత ఇకలేరు!

jayalalitha
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసిన వారిలో ఒకరైన జయలలిత కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. సెప్టెంబర్ నెలనుంచీ ఆసుపత్రికే పరిమితం అయిన ఆమెకు, నిన్న సాయంత్రం గుండెపోటు రావడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. దీంతో నిన్న రాత్రి నుంచి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తూ వచ్చినా పరిస్థితి విషమంగానే ఉంటూ వచ్చింది. చివరకు ఈ రాత్రి 11.30 గంటలకు ఆమె అపోలో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. జయలలిత మరణంతో తమిళనాడులో ఆమె అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

24 ఫిబ్రవరి, 1948లో మైసూరు ప్రాంతంలో జన్మించిన జయలలిత, సినిమాలంటే ఇష్టంతో ఆ రంగం వైపు వెళ్ళి తన సినీ కెరీర్ ప్రారంభించారు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేశాక, 1964లో ఓ కన్నడ సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో సుమారు 140కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తర్వాత, తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ ప్రేరణతో 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ స్థాపించిన ఏఐడీఎంకే పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకొని పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంజీఆర్ తర్వాత ఆయన వారసురాలని ప్రకటించుకున్న ఆమె, ఆయన పేరు నిలబెడుతూ 1991లో మొదటి సారి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఆ తర్వాత ఐదు సార్లు ఆ పదవికి ఎన్నికయ్యారు.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన జయలలిత, సెప్టెంబర్లో అనారోగ్యం పాలవ్వడంతో అప్పట్నుంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అభిమానులు, జనాలంతా ‘పురచ్చి తలైవి’, ‘అమ్మ’ అని పిలుచుకునే జయలలిత మరణించడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటనే చెప్పుకోవాలి. జయలలిత ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుతూ ఆమె మృతి పట్ల 123తెలుగు తరపున సంతాపం ప్రకటిస్తున్నాం.