‘ఖైదీ నెం. 150’లో చరణ్ గెస్ట్ రోల్ ఉంటుందా?

ra
మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమాకు ‘ఖైదీ నెం. 150’ అన్న టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజును పురస్కరిచుకొని ఈ ఉదయం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానుల వద్ద నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే చిరంజీవి సినిమాపై అభిమానులు చూపిస్తోన్న ఆదరణకు ఆయన కుమారుడు రామ్ చరణ్ థ్యాంక్స్ తెలిపారు. ఇప్పటికే 50%పైగా షూటింగ్ పూర్తైందని, మొదట దీపావళికి ఫస్ట్‌లుక్ విడుదల చేయాలనుకున్నా, అభిమానుల కోరిక మేరకు ఇవ్వాళే ఫస్ట్‌లుక్ విడుదల చేశామని స్పష్టం చేశారు.

ఇక ఈ సినిమాలో తాను గెస్ట్ రోల్ చేయనున్నట్లు చాలాకాలంగా వస్తోన్న వార్తలపై స్పందిస్తూ, ఇప్పటికైతే గెస్ట్ రోల్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని, టాకీ పార్ట్ పూర్తయ్యాక పాటల షూటింగ్ జరిగేప్పుడు ఆ విషయం ఆలోచిస్తానని చరణ్ ఈ సందర్భంగా తెలిపారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం. 150’కి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.