
‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించిన సుధీప్ ఆ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించారు. కన్నడలో సూపర్ స్టార్ హీరో అయిన సుధీప్, రాజమౌళి కోసం ‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించారు. ఆ సినిమాతో సుధీప్ బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక తాజాగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో సుధీప్ నటించిన విషయం తెలిసిందే! అస్లామ్ ఖాన్ అనే అతిథి పాత్రలో బాహుబలి మొదటి భాగంలో ఆయన కనిపించనున్నారు.
బాహుబలి విషయమై సుధీప్ పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘బాహుబలి రెండో భాగంలోనూ మీ పాత్ర ఉంటుందా?’ అన్న ఓ ప్రశ్నకు సమాధానంగా, “బాహుబలి మొదటి భాగంలో నాది గెస్ట్ రోల్ మాత్రమే. చివర్లో వచ్చే చిన్న పాత్ర. ఇక బాహుబలి రెండో భాగంలో నేను ఉంటానా? లేదా? అన్నది చెప్పలేను. రాజమౌళి ఏ విషయాన్నీ క్లియర్‌గా చెప్పరు. ఏడు రోజుల్లో నా పార్ట్ షూటింగ్ పూర్తైంది. క్లైమాక్స్‌లో నా డైలాగులు కొన్ని ఉన్నాయి. దీని తర్వాత సెకండ్ పార్ట్‌లో నా పార్ట్ ఉంటుందా? అని రాజమౌళిని అడిగా. ఆయన ఓ చిన్న నవ్వు నవ్వారంతే. ఆ సమయంలో పక్కనే ఉన్న సత్యరాజ్ గారు ‘సుధీప్.. మరో 100 రోజులు రెడీ చేసుకో..’ అన్నారు. ఏమో చూడాలి మరి!” అంటూ తన సమాధానాన్ని చెప్పారు.
మరి బాహుబలి సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి సుధీప్‌ను గెస్ట్ రోల్ నుంచి కీ రోల్‌కి మార్చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో మే 31న విడుదల కానుంది. అదేరోజు ట్రైలర్ కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే!