మెగా హీరో సినిమాకు అదిరిపోయే క్లైమాక్స్!

28th, November 2016 - 03:34:21 PM

winner
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఒక్కో సినిమాతో తన స్థాయి పెంచుకుంటూ వెళుతున్నారు. ‘సుప్రీమ్’ సినిమాతో సాయిధరమ్ తేజ్ మార్కెట్ స్థాయి చాలా పెరిగింది. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘తిక్క’ భారీ ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. దీంతో సాయిధరమ్ తేజ్ స్టార్ హీరో రేసులోకి వచ్చేసినట్లు చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలతో కెరీర్ మొదట్లోనే వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకునేలా సాయిధరమ్ తేజ్ కూడా తన స్టైల్ కమర్షియల్ సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన చేస్తోన్న ‘విన్నర్’ భారీ బడ్జెట్‌తో, అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోందట. ఈమధ్యే ఉక్రేయిన్, టర్కీలలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్, ఈ షెడ్యూల్‌లోనే రెండు పాటలు, కీలక సన్నివేశాలతో పాటు అదిరిపోయే క్లైమాక్స్ ఫైట్ కూడా చిత్రీకరించారట. గుర్రాల రేసుకోర్టులో నడిచే ఈ ఫైట్‌ను పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన స్టంట్‌మాస్టర్స్ డిజైన్ చేశారట. బలమైన కథతో నడిచే ఈ సినిమాలో, చివర్లో వచ్చే ఈ క్లైమాక్స్ ఫైట్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంటుందని, సినిమాకు ఇదే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని టీమ్ తెలిపింది. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.