బ్లాక్‌బస్టర్ ‘శ్రీమంతుడి’కి ఏడాది..!

srimantudu
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహేష్ మార్కెట్ స్టామినాను సినీ పరిశ్రమకు మరోసారి కొత్తగా పరిచయం చేసిన ఈ సినిమా, గతేడాది సరిగ్గా ఇదే రోజున (ఆగష్టు 7న) విడుదలైంది. తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి’ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకున్న శ్రీమంతుడు నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు మరోసారి శ్రీమంతుడు విశేషాలను పంచుకుంటూ సినిమాను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఇక మహేష్ సైతం ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్స్ చేశారు. ‘శ్రీమంతుడు’ సినిమా తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమని, ఆ సినిమాపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఊరిని దత్తత తీసుకోవడమనే ఓ బలమైన సామాజిక అంశంతో ముడిపడిన సినిమాగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’, గతేడాది విడుదలైనప్పుడు ఎంతోమందిని ఆలోచింపజేసింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మొదటి సినిమాగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’లో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు.