బర్త్ డే: జబర్దస్త్ గడ్డం నవీన్ స్పెషల్ ఇంటర్వ్యూ

Published on Sep 1, 2023 8:32 am IST

ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే న‌టులంటే ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడూ అభిమాన‌మే. బుల్లితెర‌పై, బిగ్‌స్క్రీన్‌ పై న‌వ్వుల జ‌ల్లు కురిపిస్తూనే వున్న న‌టుడు జబర్దస్త్ నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు ఇలా ఎన్నో పేర్లతో పాపుల‌ర్ అయ్యాడు. వ‌రుస సినిమాల‌తో, విభిన్న పాత్ర‌ల‌తో బిజీబిజీగా ఉన్నాడు. 25 ఇయర్స్ ఇండస్ట్రీ జబర్దస్త్ గడ్డం నవీన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.

నమస్తే నవీన్ గారు, ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

థ్యాంక్యూ వెరీ మచ్ సర్.

తెల్ల‌గ‌డ్డంతో ఎంతో పాపుల‌ర్ అయ్యారు. ఇంత‌కీ మీకు ఇది ఎన్నో పుట్టిన రోజు? మీ జర్నీ లో ఈ పుట్టిన రోజు ప్రత్యేకత ఏంటి?

ఇది 47 వ పుట్టిన రోజు. సినీ ఇండస్ట్రీకి1995 లో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతుంది. మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చే అవకాశం వచ్చింది. అమెరికా వెళ్లాలనే చిరకాల కోరిక. వెంకట్ దుగ్గిరెడ్డి, దర్గా నాగిరెడ్డి సహాకారంతో అమెరికా వెళ్లాను. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రంలో మంచి అవకాశం దక్కింది. దీనితో పాటు 10 సినిమాలు పూర్తి అయినవి ఉన్నాయ్. వాటిలో విక్టరీ వెంకటేష్ సైందవ్ సినిమా, సందీప్ కిషన్ సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందం కలిగింది. అందుకే ఈ సంవత్సరం నా పుట్టిన రోజుని సంతృప్తికరంగా జరుపుకుంటున్నాను.

 

మిమ్మల్ని జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎలా పిలిస్తే మీరు ఇష్ట పడుతారు?

నన్ను ఎవరికి నచ్చినట్టు వాళ్లు పిలుస్తారు. మొదట్లో నవీన్ అని, జబర్దస్థ్ కి వచ్చాకా జబర్దస్త్ నవీన్ అని, గడ్డం ఉన్నప్పుడు గడ్డం నవీన్ అని, లత్కోర్ నవీన్, నథింగ్ నవీన్, ఇటిక నవీన్ అని ఇంటిపేరుతో పిలుస్తుంటారు. నాకు జబర్థస్త్ లైఫ్ ఇచ్చింది కాబట్టి, జబర్దస్త్ గడ్డం నవీన్ అని పిలుస్తే చాలా హ్యాపిగా ఫీల్ అవుతాను.

 

గడ్డం మీకు ప్లస్సా? మైనస్సా?

గడ్డం నాకు డబుల్ ప్లస్ అయ్యింది. పరిస్థితులు బాగాలేనప్పుడు అనుకోకుండా పెంచాను. కానీ అదే అవకాశాలు తెచ్చిపెట్టింది. గడ్డం నవీన్ అంటేనే గుర్తుపడుతున్నారు. విదేశాలలో కూడా మన తెలుగువారు ఆదరిస్తున్నారు. మరిన్ని అవకాశాలు, నటుడిగా మంచి పేరు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

 

నటులుగా మీరు అందరికి సుపరిచితులే, మీ కుటుంబ నేపథ్యం గురుంచి చెప్పండి.

మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారులు చేశాను. ఒకనోక సమయంలో ఆఫీస్ బాయ్ కూడా పనిచేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బాబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. ఫ్యామిలీతో హ్యాపిగా ఉన్నాను. కానీ నా తల్లిదండ్రులు నటుడుగా నేను ఎదగాలని కోరుకున్నారు. కానీ వాళ్లు లేరు అదే నాకు పెద్ద బాధ కలుగుతుంది. నాకు తమ్ముడు కిషోర్, చెల్లి రాణి ఉన్నారు. పుట్టిపెరిగింది సికింద్రాబాద్. బాలంరాయ్ లోనే. వెస్లిబాయ్స్ స్కూల్, మోహిదీపట్నం లాల్ బహుదూర్ కాలేజీలో ఇంటర్ వ‌ర‌కు చ‌దివాను. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ, మిగతా ఇబ్బందుల‌న్ని ఫేస్ చేశాను.

 

మీ లవ్ స్టొరీ చాలా పాపులర్, దాని గురుంచి చెప్పండి

సినిమాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. ప్రేమించేది ఎందుకమ్మా సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండే అప్పుడు. సురేందర్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్‌కి తెలియకుండా పెళ్లిచేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

 

సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ స్థాయి గుర్తింపు సంపాదించడం చాలా కష్టం. మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ నట ప్రయాణం గురుంచి చెబుతారా,

అందరిలా సినిమా ఆఫీస్ ల చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ సెలెక్ట్ చేశారు. కానీ ఏజ్ సూట్ అవ్వడం లేదని పంపిచారు. అప్పుడు నా స్టైల్ చూసి ఏదో ఒక అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎక్కువగా వచ్చాయి. రాంసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, బ్యాడ్ బాయ్స్ సినిమాలు చేశాను. ఆ తర్వాత విలన్ గ్యాంగ్స్ లో ఎక్కువగా నటించాను. కానీ జబర్ధస్త్ ఎంట్రీ తర్వాతే గుర్తింపు లభించింది. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి , అదిరే అభి, చలాకీ చంటి వాళ్ల వల్ల నాకు జబర్ధస్త్ లోకి ఎంట్రీ దొరికింది. అదిరే అభి ప్రోత్సాహంతో మరిన్ని అవకాశాలు దక్కాయి. వారికి ఎప్పటికి రుణపడి ఉంటాను.

 

మీరు ఏ ల‌క్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చారు?

హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. బ్ర‌హ్మనందం, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ వంటి వారి స్పూర్తి వల్ల కామెడి పాత్రలు కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది.

 

మీరు ఈవెంట్స్‌లో, టీవీ షోస్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును ఇమిటేట్ చేస్తున్నారు. ఆ అనుకరణపై ఆయన ఏమైనా అన్నారా?

దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారిని అనుకరించడం సాహసమే. కానీ అవినాష్ – కార్తీక్ టీమ్‌లో ఇచ్చిన ఆ వేషం నాకు బాగా పేరు తెచ్చింది. ఒకసారి రాఘవేంద్రరావు గారి ముందే చేశాను. ఆయనేమంటారో అనుకున్నాను. కానీ చాలా అప్యాయంగా దగ్గర తీసుకోని ఆశీర్వదించారు.

 

సినిమాలలో, టీవీలలో, ఈవెంట్స్‌ల్లో మీ కెరీర్ బిజీగా ఉంది. ఇలాంటి టైమ్‌లో కూడా ఓ ఉద్యోగం చేస్తున్నారట. మీకు వచ్చే డబ్బులు సరిపోవడం లేదా?

జబర్ధస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబం నడవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు. ఎప్పుడు వెళ్లిన నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చెయ్యలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహాకారంతో కష్టపడుతూనే ఉంటాను.

 

జబర్దస్త్ లో మీతో పనిచేసే మీ సహా నటులు దర్శకులుగా, హీరోలుగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మ‌రి మీ లక్ష్యం ఏంటి?

నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. జబర్ధస్త్ నుంచి వేణు గారు, శాంతకుమార్ గారు, అధిరే అభిగారు, రాకింగ్ రాకేష్ గారు దర్శకులుగా మారారు. మరికొంతమంది హీరోలు అయ్యారు. దానికి ఎన్నో తెలివితేటలు కావాలి. కాబట్టి నేను నిర్మాతగా హిట్ కొట్టాలన్న‌దే నా లక్ష్యం. ఎప్పటికైనా నిర్మాతగా ఓ సినిమా చేస్తా. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలనేదే నా డ్రీమ్

 

నటుడిగా కమెడియన్‌గానే చేస్తారా? ఏ పాత్ర ఇచ్చిన చేస్తారా?

విభిన్నమైన పాత్రలు చెయ్యాలని కోరిక ఉంది. కమెడియన్ గా చేస్తున్నాను. సెంటిమెంట్ పాత్రలు, విలన్ పాత్రలు చెయ్యాలని ఆశ ఉంది. దర్శకనిర్మాతలు ఎప్పటికైనా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. 150 సినిమాలలో చేశాను. దానిలో 90 సినిమాలే మంచి పాత్రలు చేసినవి. ప్రస్తుతం రామ్ చరణ్ గారి గేమ్ ఛేంజర్, విక్టరీ వెంకటేష్ గారి సైందవ, భైరవ కోన, మిస్టరీ, వృషభ, చూ మంతర్, భూతద్దం భాస్కర్ వంటివి నేను న‌టించిన అప్ క‌మింగ్ సినిమాలు.

 

ఇండస్ట్రీకి మీ కుటుంబ నుంచి ఎవరైనా వస్తున్నారా?

మా ఇద్దరి అబ్బాయిలు చదువుకుంటున్నారు. వాళ్ల ఇష్టాలు వారివి. వారిని సినీ ఇండస్ట్రీకి రావాలని నేనేమి బలవంతం పెట్టాను. వాళ్లు ఏది కావాలన్న నా సపోర్ట్ ఉంటుంది.

 

పుట్టిన రోజు సందర్బంగా, మీ అభిమానులకు మీరు ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

ఫ్యాన్స్ ఉన్న పెద్ద నటుడిని కాదు. కాకపోతే వారిచ్చిన పోత్సాహమే ప్రస్తుత నా సినీ జీవితం. వారందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ప్రతిఒక్కరు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని విజ్ణప్తి.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :