శింబు సినిమాలో జగపతి బాబు కీ రోల్!

jagapathi-babu
హీరోగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయి అద్భుతమైన రెండో ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయన ‘లెజెండ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ లాంటి సూపర్ హిట్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులోనే కాక ఆయనకు తమిళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా ఆయన విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో నటించనున్నారు. తన గత చిత్రం ‘వర్ణ’ (ఇరండామ్ ఉలగమ్) భారీ అపజయాన్ని మూటగట్టుకోవడంతో ఈసారి తనకు బాగా కలిసొచ్చిన ప్రేమకథను ఎంచుకున్నారు సెల్వ రాఘవన్. శింబు, త్రిష, తాప్సీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించనున్నారు. సినిమా మొత్తం ఈ నాలుగుల చుట్టే తిరుగుతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. జగపతి బాబు గతంలో విక్రమ్ హీరోగా నటించిన తాండవం సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే!

Exit mobile version