‘జనతా గ్యారెజ్’ ఆడియో రిలీజ్ హంగామా మొదలైంది!

janatha-m
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా రోజు రోజుకీ అంచనాలను పెంచుకుంటూ దూసుకెళుతోంది. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఆగష్టు 12న విడుదల చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన టీమ్, ప్రస్తుతం ఈ ఆడియో విడుదల కోసం చకచకా ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో జనతా గ్యారెజ్ సినిమాతో పాటు ఆడియోపై కూడా అంచనాలన్నీ తారాస్థాయిలోనే ఉన్నాయి.

కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మిర్చి, శ్రీమంతుడు.. రెండూ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ కావడంతో, జనతా గ్యారెజ్ ఆడియో ఎలా ఉండనుందన్న ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక ఈ ఆడియో వేడుకకు అభిమానులను సిద్ధం చేసేలా రోజుకో పోస్టర్ రిలీజ్ చేయడం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాయంత్రం కూడా ఎన్టీఆర్ స్వయంగా ఓ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.