ఒక రోజు ముందే వచ్చేస్తోన్న ‘జనతా గ్యారెజ్’!

jantha-garage

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారెజ్’ సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. నిన్నటితో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీకల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీలో మార్పు జరిగింది. ముందే ప్రకటించినట్లు సెప్టెంబర్ 2న కాకుండా, ఒకరోజు ముందే, అంటే సెప్టెంబర్ 1నే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ‘జనతా గ్యారెజ్’ టీమ్ తెలిపింది.

సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ ఉండడంతో, ఆ రోజున అన్ని షోస్ పడే అవకాశం లేకపోవడంతో సినిమాను ఒకరోజు ముందుకు జరిపినట్లు టీమ్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ 5న వినాయక చవితితో కలుపుకొని జనతా గ్యారెజ్‌కు అతిపెద్ద వీకెండ్ బాగా కలిసి రానుందని చెప్పొచ్చు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంత హీరోయిన్లుగా నటించారు.