అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సినిమాలో జాన్వి కపూర్ ని హీరోయిన్ గా పెట్టాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జాన్వికి సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి కూడా పూరి చెప్పాడట. అయితే జాన్వి కపూర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా యస్ అని గాని, లేదా నో అని గాని చెప్పలేదని తెలుస్తోంది. పూరి, జాన్వి కపూర్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇక జాహ్నవి కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ‘ధడక్’ చిత్ర దర్శకుడు శశాంక్ ఖైటన్ జాహ్నవి కపూర్ నుండి మంచి నటన రాబట్టగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ‘ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్’ పై ఈ చిత్రాన్ని నిర్మించి ఆమెకు బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ అందించారు. మరి జాన్వి త్వరలో తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోందేమో చూడాలి.
