స్టార్ హీరోలకంటే ముందు తానే అంటున్న ధరమ్ తేజ్ !


ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ చాలా వరకు సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ కానున్నాయి. ముందుగా ఎన్టీఆర్ – బాబిల కాంబినేషన్లో రూపొందుతున్న ‘జై లవ కుశ’ సెప్టెంబర్ 21 న రిలీజవుతుండగా సూపర్ స్టార్ మహేష్ – మురుగదాస్ ల కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న రానుంది. ఇక సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ – పూరి జగన్నాథ్ లు చేస్తున్న ‘పైసా వసూల్’ కూడా సెప్టెంబర్ 29 న విడుదలకానుంది.

ఇలా ముగ్గురు స్టార్ హీరోలు రెండు మూడు రోజుల వ్యవధిలో పోటీకి దిగుతుంటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం వాళ్లందరి కంటే ముందు నేనే అన్నట్టు బివిఎస్ రవి దర్శకత్వంలో చేస్తున్న ‘జవాన్’ సినిమాతో సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలోకి దిగిపోనున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇలా స్టార్ హీరోల సినిమాలకు దాదాపు 20 రోజుల ముందుగా విడుదలవుతుండటం సుప్రీం హీరో సినిమాకి కలిసోచ్చే అంశమని చెప్పొచ్చు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.