‘అమ్మ’కు సంతాపం ప్రకటించిన సినీ ప్రపంచం!

jayalalitha
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసిన వారిలో ఒకరైన జయలలిత నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలనుంచీ ఆసుపత్రికే పరిమితం అయిన ఆమెకు గుండెపోటు రావడంతో మృత్యువుతో ఒకరోజుకు పైగా పోరాడి రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక సినీ పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వారిలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లోని తారలంతా జయలలిత మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, ఆమె చేసిన ప్రజాసేవలు మరువలేనివని కొనియాడారు. రజనీ కాంత్, మోహన్ బాబు, ఎన్టీఆర్ తదితర స్టార్స్ అంతా ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇక తమిళనాడులో ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభిమానులు, జనాలంతా పురచ్చి తలైవి, అమ్మ అని పిలుచుకునే జయలలిత మరణించడం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటనే చెప్పుకోవాలి. జయలలిత ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుతూ ఆమె మృతి పట్ల 123తెలుగు తరపున సంతాపం ప్రకటిస్తున్నాం.