‘మా’ అధ్యక్ష బరిలో నటి జయసుధ!

Jayasudha
ప్రముఖ హీరో రాజేంద్రప్రసాద్ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్‌కు ప్రస్తుతం నాటి హీరో, ఎంపీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న జరగనున్న ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. 2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ జరిగినా.. అధ్యక్షుడిని మాత్రం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు.

గత రెండు దఫాలుగా మురళీ మోహన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ పదవిని మళ్ళీ చేపట్టే ఆలోచన ఆయనకు లేదని సమాచారం. ఈ క్రమంలోనే రాజేంద్రప్రాసాద్ తెరపైకి వచ్చారు. రాజేంద్రప్రసాద్ పేరుతో పాటు మంచు విష్ణు పేరు కూడా తెరపైకి వచ్చినా ఆయన అందుకు విముఖత చూపారు. రాజేంద్రప్రసాద్‌కు ఆయన మద్దతు కూడా ప్రకటించారు. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ ఎన్నిక లాంచనమే అనుకున్న తరుణంలో మా అధ్యక్ష పదవికి ప్రముఖ నటి జయసుధ పోటీ చేయనున్నట్లు వినిపిస్తోంది. ఇప్పుడు జయసుధ రాకతో పోటీ అనివార్యం కానుంది. నిజానికి మా అధ్యక్షుడిని ఏకగ్రీవంగానే ఎన్నుకునే సాంప్రదాయం ఉంది. మరి ఈ సారి కూడా అలాగే జరుగుతుందా ? లేదా అన్నది చూడాలి.

Exit mobile version