ట్రైలర్ రిలీజ్ వేడుకకు సిద్దమవుతున్న ‘జై లవ కుశ’ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం యొక్క పాటలు గత వారం విడుదలై మంచి స్పందన సంపాదించుకున్నాయి. పాటలను భారీ ఎత్తున ఆడియో కార్యక్రమం నిర్వహించి విడుదలచేయాలనుకోగా గణేష్ నిమజ్జనం మూలాన కుదరలేదు. దీంతో ఈరోజు సాయంత్రం అభిమానుల కోసమే అన్నట్టు గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ వేడుకను జరపనున్నారు.

సాయంత్రం హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు భారీ సంఖ్యలు అభిమానులు తరలిరానున్నారు. ఒక్కో టీజర్లో ఒక్కో పాత్రతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ట్రైలర్లో ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. ఈ ఇన్నాళ్లు సినిమా ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్న అభిమానులకు ఈ ట్రైలర్ ద్వారా ఒక అంచనా రానుంది. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.