‘జై లవ కుశ’ ఐదవ పాట విడుదల ఎప్పుడంటే !


ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం యొక్క ఆడియోలో మొత్తం ఐదు పాటలుండగా టీమ్ కేవలం నాలుగింటిని మాత్రమే కొద్దిరోజుల రిలీజ్ చేసి 5వ పాటను హోల్డ్ చేసి పెట్టింది. ఎందుకంటే ఈ పాట చాలా ప్రత్యేకమైనదని, అభిమానులకు ఎంతగానో నచ్చుతుందని, కొరియోగ్రఫీ దగ్గర్నుంచి మ్యూజిక్ వరకు అన్నీ కొత్తగా, భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చారు టీమ్. దీంతో ప్రేక్షకుల్లో ఆ పాట ఎలా ఉంటుందో వినాలనే తపన ఎక్కువైంది.

షూటింగ్ తో పాటు కంపొజిషన్, రికార్డింగ్ అన్నీ పూర్తిచేసుకున్న ఈ స్పెషల్ సాంగ్ ‘స్వింగ్ జర’ ను రేపే రిలీజ్ చేయనున్నారట. ఇందులో ఎన్టీఆర్ తో కలిసి తమన్నా ఆడి పాడింది. ఈ ప్రత్యేక గీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని, ప్రేక్షకులకు బోనస్ లాంటిదని మిల్కీ బ్యూటీ గతంలోనే తెలిపారు. మరి రేపు రిలీజ్ కానున్న ఈ పాట ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.