జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ పత్రికా ప్రకటన

Published on Aug 14, 2021 8:15 pm IST

ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న వార్తలు తీవ్ర ఆవేదనను బాధను కలిగిస్తున్నాయని జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ ప్రెసిడెంట్ బి.రవీంద్రనాథ్ అన్నారు. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నానని చెప్పుకొచ్చారు.

అయితే కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా, అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా డెల్లాయిట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ఈ నెల 11వ తేదిన జరిగిన సమావేశంలో నిర్ణయించాం. తద్వారా స్థలాల కేటాయింపులు ఎవరెవరికి ఎలా జరిగాయి. ఎంత ధరలకు ఇచ్చారనే అన్ని విషయాలు తేల్చాలని భావించామని అన్నారు.

కానీ కార్యదర్శి మురళీముకుంద్‌ పాత పాలకవర్గం తప్పులను బయటపెట్టే ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారని, కమిటీ నిర్ణయాల అమలుకు కార్యరూపం ఇవ్వాల్సిన కార్యదర్శి ఫైళ్ళను తన ఆధీనంలోనే ఉంచేసుకున్నారు. అసలు గత కొంతకాలంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారికి అండగా నిలవాలనే వైఖరితోనే ఆయన ఉన్నారని, తన అధీనంలో ఉన్న ఫైళ్ళను ఇంటి వద్దకు తీసుకెళ్ళడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. కొంత మంది సభ్యులకు సంబంధించిన న్యాయమైన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్ళను కూడా పెండింగులో పెట్టేశారు. కార్యాలయంలో ఫైళ్లు ఉన్న లాకర్లకు తాళం వేసుకుని వెళ్ళారు. ఎవరి అక్రమాలను బయటపెడతామని నమ్మి సభ్యులు మమ్మల్ని గెలిపించారో ఆ పాత పాలకవర్గంలోని పెద్దలతో మురళీ ముకుంద్ కుమ్మక్కయ్యారు. వాళ్ళ అవినీతి బయటికి రాకుండా కుట్ర పన్నారు. అందులో భాగంగానే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు, సహకార శాఖకు తప్పుడు ఫిర్యాదులు చేశారు.

ఈనెల 11 వ తేదీన జరిగిన సమావేశంలో తనపై ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని మురళీ ముకుంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు. అక్కడ ఏం జరిగిందనే దానికి హాజరైన సభ్యులే సాక్ష్యం. అసలు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూసినా తేటతెల్లమవుతుంది. ఆడియో, వీడియో రికార్డింగ్ ఉంది. వాటి ద్వారా మా చిత్తశుద్ధి ఏంటో నిరూపితమవుతుందని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల కారణంగానే బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు మురళీముకుంద్ వైఖరిని తప్పుపట్టారు. దాంతో ఆయనే సమావేశంలో అసహనాన్ని ప్రదర్శించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో సభ్యుల హక్కులను కాపాడే క్రమంలో పాలకవర్గం కార్యదర్శి అధికారాలను తప్పించేలా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ సొసైటీ ప్రెసిడెంట్‌కు దఖలుపరుస్తూ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సొసైటీ బైలాస్‌లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నాం. సొసైటీ అధ్యక్షుడు స్వయంగా ఎన్ని సార్లు అడిగినా, మొత్తం మేనేజింగ్‌ కమిటీ చెప్పినా ఫైళ్ళను ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దాంతో ఆయన గత పాలవర్గంలో అక్రమాలు చేసిన వారితో కుమ్మక్కయ్యారనేది తేలిపోయింది. దీనివల్లే అయనకున్న అధికారాలను తొలగించాం. దీనికి సంబంధించిన వివరాలు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమాలను నిరోధించి తీరుతాం. సభ్యులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.

సంబంధిత సమాచారం :