కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే అనేక మంది కార్మికులు మరియు ఉద్యోగుల పొట్టకొట్టింది. ఉపాధి లేక అనేక మంది ఆకలి చావుల బారిన పడుతున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఇక కరోనా వైరస్ వలన భారీగా నష్టపోయిన పరిశ్రమలలో చిత్ర పరిశ్రమ ఒకటి. ఉపాధి లేక నటులు, నిర్మించిన సినిమాలు విడుదల కాక నిర్మాతలు, పని లేక సాంకేతిక నిపుణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ లోని జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సినిమా షూటింగ్స్ లేక వారు అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక ఇక్కట్లు పడుతున్నారు. రెండు మూడు నెలలు తమ దగ్గర ఉన్న సేవింగ్స్ తో నెట్టుకువచ్చిన జూనియర్ ఆర్టిస్ట్స్ లు ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడుతున్నారు. రోజుకు వెయ్యి నుండి 3 వేలు సంపాదించే వారికి కనీస ఆదాయం లేకుండా పోయింది. సీసీసీ ఛారిటీ పేరిట నిత్యావసర వస్తువులు అందించినప్పటికీ మిగతా ఆర్థిక అవసరాలు తీరక బాధలుపడుతున్నారు. పెద్ద సినిమాల షూటింగ్స్ మొదలై యధావిధిగా షూటింగ్స్ జరిగితే మినహా వీరి కష్టాలు తీరే మార్గం కనిపించడం లేదు.
