కొత్త ట్విస్ట్ : ‘జ్యో అచ్యుతానంద’ కథ ఇదేనా?

31st, August 2016 - 03:02:30 PM

jyo-atchutananda
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారి ఎంతో పేరు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో సిద్ధమైపోయారు. నారా రోహిత్, నాగ శౌర్యలు హీరోలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌తోనే అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయి వెంటపడడం అన్న అంశంపై సినిమా నడుస్తుందని ట్రైలర్ స్పష్టం చేయడం బాగా ఆకర్షించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఓ పోస్టర్ అసలు కథను పరిచయం చేస్తూ, ఓ కొత్త ట్విస్ట్‌ను జతచేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ కొత్త పోస్టర్‌లో నారా రోహిత్, నాగ శౌర్య ఇద్దరూ ఎవరికి వారే తమ భార్యలతో ఉండడం చూస్తూంటే, ఇదే ఈ సినిమాకు క్లైమాక్స్ పాయింటా అన్నట్లుగా తోస్తుంది. లేదా తాము ప్రేమించిన అమ్మాయి తమతో విడిపోయి, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాక తిరిగొస్తుందా? వస్తే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశం చుట్టూ కథ నడుస్తుందా? ఇలా ఈ ఒక్క పోస్టర్ రకరకాల ఆలోచనలను కలిగిస్తూ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి అసలు కథ ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ 9వరకూ ఆగాల్సిందే. వారాహి చలనచిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు.