యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ దీపావళి కానుకగా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను సుజిత్, సందీప్ ద్వయం డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
కానీ, ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ‘క’ చిత్రాన్ని కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు హీరో కిరణ్ అబ్బవరం తెలిపాడు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడాడు. మలయాళంలో ‘క’ చిత్రాన్ని నటుడు దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా అదే రోజున రిలీజ్ అవుతుండటంతో మలయాళంలో ‘క’ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని కిరణ్ అబ్బవరం తెలిపాడు. ఇక తమిళంలో తమకు థియేటర్లు దొరకనందున ‘క’ చిత్రాన్ని తమిళంలోనూ రిలీజ్ చేయడం లేదని అతడు తెలిపాడు.
దీంతో ప్రస్తుతానికి ‘క’ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నామని కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాను తన హోమ్ బ్యానర్ క ప్రొడక్షన్స్‌పై నిర్మించాడు. ఈ సినిమాలో తన్వీ రామ్, నయన సారిక హీరోయిన్లుగా నటించారు.