విడుదలకు ముందే ’కాష్మోరా’కు కత్తెర!

27th, October 2016 - 11:48:30 PM

Kashmoraa
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ కాష్మోరా రేపు (అక్టోబర్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ కార్తీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా రెండు భాషల్లో ఈ సినిమా 2000లకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఇక ఇప్పటికే తారాస్థాయిలో ఉన్న అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. విడుదలకు ముందే దర్శక, నిర్మాతలు రన్‌టైమ్ ఎక్కువైపోయిందన్న ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలు తొలగించారట.

సుమారు 12 నిమిషాలు తొలగించాక ఇప్పుడు 2 గంటల 32 నిమిషాలకు రన్‌టైమ్ సెట్ అయింది. ప్రస్తుతం రన్‌టైమ్ ఎక్కువైపోయినా, కాస్త బోర్ అయినా ప్రేక్షకులు చూస్తూ ఉండకపోవడంతో విడుదలకు ముందే టీమ్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకుందట. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ మూడు డిఫరెంట్ రోల్స్‌లో ఆకట్టుకోనున్నారు. కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించగా పీవీపీ సినిమా తెలుగులో విడుదల చేస్తోంది.