యూఎస్‌లో అప్పుడే 1 మిలియన్ కొట్టిన ‘కబాలి’!

kabali
సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే యూఎస్‌తో పాటు పలు ఇతర దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ కొన్ని పడిపోయాయి. ఇక ఈ ప్రీమియర్ షోస్ ఇలా మొదలయ్యాయో లేదో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనంలా కలెక్షన్స్ వచ్చిపడుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ముందస్తుగా అందుతోన్న రిపోర్ట్స్‌తోనే సినిమా 1 మిలియన్ మార్క్ దాటేసింది.

దీన్ని బట్టి రజనీ సినిమాకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఉదయం షోస్ మొదలవ్వగా, యూఎస్‌లో ఈరోజు మొత్తం పూర్తయ్యేసరికల్లా కలెక్షన్స్ మరో రేంజ్‌లో ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది. తమిళంళో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా పేరున్న పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. రేపు ఉదయం ఆటతో పూర్తి స్థాయిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సుమారు 4000 థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా తమిళనాట ఇప్పటికే పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది.