300 కోట్ల క్లబ్‌లో చేరిన ‘కబాలి’..!

kabali
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రియలిస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి మిక్స్‌డ్ రెస్పాన్సే వచ్చినా, సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అభిమానులంతా, ఎలా ఉన్నా సినిమా చూసేయాలని అనుకుంటూ ఉండడంతో కలెక్షన్స్ ఇప్పటికీ స్టడీగానే కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోవడం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో నిర్మాత కళైపులి థాను మాట్లాడుతూ, ఆరు రోజుల్లో ‘కబాలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అధికారికంగా ప్రకటించారు. రజనీ కాంత్ నటించిన రోబో సినిమాను రికార్డులను కూడా కబాలి దాటేస్తుందని ప్రచారం జరుగుతోంది. మలేషియా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‍గా కనిపించి సినిమాను తన భుజాలపై నడిపించాడు. రాధికా ఆప్టే, ధన్సిక ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.