‘కబాలి’ మేనియా మొదలైంది..!

Kabali2
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరో ఐదు రోజుల్లో థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మూవీ టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా అందుకు తగ్గట్టుగానే సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా జపమే కనిపిస్తోన్న నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ టికెట్స్ దొరకడమనేది గగనంగా మారిపోయింది.

ఈ క్రమంలో నేటినుంచి బుకింగ్స్ మొదలుకానుందన్న అభిమానులంతా తమ టికెట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్స్ అమ్మకం మొదలుపెట్టగా, ఆన్‌లైన్లో గంటలో అన్ని టికెట్స్ అమ్ముడుపోవడం విశేషంగా చెప్పుకోవాలి. తమిళంలో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా మంచి పేరున్న పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాను కళైపులి థాను పెద్ద ఎత్తున నిర్మించారు. రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా ఇందులో కనిపించనున్నారు.