‘బాహుబలి’ తర్వాత ‘కబాలి’యే..!

kabali-baahubali
శుక్రవారం వచ్చిందంటే ఏదో ఒక సినిమా థియేటర్లలో వాలిపోయి సందడి చేస్తూనే ఉంటుంది. చిన్న సినిమా అయితే పెద్దగా ఆర్భాటాలేవీ లేకుండా, పెద్ద హీరో సినిమా అయితే అభిమానుల కోలాహలంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక కొన్ని ప్రత్యేక తరహా సినిమాలు మాత్రం ఎప్పుడూ కనిపించని క్రేజ్‌తో, ప్రతి ఒక్కరూ మొదటి రోజే సినిమా చూసేయాలన్నంతగా ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి. దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ప్రభంజనమైన ‘బాహుబలి’ సినిమా గతేడాది అలాంటి ప్రత్యేక అంచనాల మధ్యనే విడుదలైంది. ఇండియన్ సినిమాలో ఇంతవరకూ రానటువంటి భారీ బడ్జెట్ సినిమా కావడం, సుమారు 3000లకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉండడం, మూడేళ్ళు రాజమౌళి టీమ్ ఆ సినిమాకు కష్టపడడం ఇవన్నీ ‘బాహుబలి’కి రిలీజ్ సమయంలో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.

మళ్ళీ సరిగ్గా ఏడాదికి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ కూడా అదే స్థాయి అంచనాల మధ్యన రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా నటించడం, రియలిస్టిక్ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన సినిమా కావడం, మలేషియాలో నివసించే తమిళుల ఇబ్బందులను ప్రస్తావించే సినిమా కావడం.. ఇవన్నీ కబాలికి ఎక్కడిలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ‘బాహుబలి’, ‘కబాలి’.. ఈ రెండు సినిమాలనూ గమనిస్తే, రెండూ విడుదలకు ముందు ఒకే స్థాయి అంచనాలను మూటగట్టుకున్నాయని చెప్పొచ్చు. మరి బాహుబలి లానే కబాలి కూడా ఆ అంచనాలను అందుకొని తిరుగులేని విజయం సాధిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.