కాజల్‌కు విలన్‌గా నటించాలని ఉందట!

kajal
కాజల్.. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్. తాజాగా ఆమె మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నంబర్ 150’లో హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సందర్భంగా సక్సెస్‌ను అభిమానులతో పంచుకుంటూ కాజల్ నిన్న ట్విట్టర్‌లో ఓ చాట్ సెషన్ నిర్వహించారు. చిరుతో నటించడం మర్చిపోలేని అనుభూతి అని, ఖైదీ నంబర్ 150 సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు.

ఇక ఈ సందర్భంగానే కాజల్‌ను ఓ అభిమాని మీ డ్రీమ్ రోల్ ఏంటి? అని ఓ ప్రశ్న అడగ్గా, కాజల్ అందుకు సమాధానంగా విలన్ తరహా నెగటివ్ రోల్ చేయడం తన డ్రీమ్ అని అన్నారు. తన పదేళ్ళ కెరీర్‌లో కాజల్ సరదాగా సాగిపోయే యువతి పాత్రలే చేయడం తప్ప ఇలా విలన్ తరహాలో ఎప్పుడూ నటించలేదు. మరి భవిష్యత్‌లో ఆమె డ్రీమ్ రోల్‌ను ఏ దర్శకులైనా ఆఫర్ చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని మూడు సినిమాలు చేస్తున్నారు.