కాజల్ కొత్త సినిమాకు టైటిల్ దొరికేసింది..!

enthavaraku-prema
సౌతిండియన్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన కాజల్, ‘టెంపర్’ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. కొద్దినెలల క్రితమే విడుదలైన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలతో మళ్ళీ సత్తా చాటాలనుకున్నా, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇక ఆమె నటించిన హిందీ సినిమా ‘దో లఫ్జోంకీ కహానీ’ కూడా పరాజయం పాలైంది. వీటన్నింటి మధ్యన కాజల్ కెరీర్‌కు ‘జనతా గ్యారేజ్‌’తో మంచి ఊపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఒక్క స్పెషల్ సాంగ్‌లోనే కనిపించినా, ఆ పాటతోనే మళ్ళీ కొత్త క్రేజ్ సంపాదించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘కవలై వెండం’ అనే సినిమాను తెలుగులోనూ డబ్ చేయనున్నారు. నిర్మాత డి. వెంకటేష్ కవలై వెండం తెలుగు డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ..’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. జీవా హీరోగా నటించిన ఈ సినిమా తమిళ నాట అక్టోబర్ 7న దసరా కానుకగా విడుదల కానుండగా, అదే నెలలో తెలుగు వర్షన్ కూడా విడుదల కానుంది. డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ రొమాంటిక్ కామెడీగా ప్రచారం పొందుతోంది.