‘కబాలి’ కి సీక్వెల్ రానుందా !

Kabali2
ఈ సంవత్సరం భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన సినిమా ‘కబాలి’. పా . రంజిత్ దర్శకత్వంలో ‘రజనీకాంత్’ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. కానీ సినిమాలో మాత్రం రజనీ మార్క్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సినిమా మొదటిరోజు నుండే మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. అయినప్పటికీ ప్రీమియర్, ఫస్ట్ డే ఓపెనింగ్స్, వీకెండ్ కలెక్షన్స్ అంటూ కబాలి వరుసపెట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది.

దీంతో నిర్మాత ‘కలై పులి ఎస్. థాను’ ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నటు, అది ఖచ్చితంగా అభిమానులు మెచ్చే విధంగా ఉంటుందని ఓ ప్రముఖ మ్యాగజైన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. పైగా దర్శకుడు పా. రంజిత్ సినిమా క్లైమాక్స్ లో కబాలిని తుపాకీతో కాల్చినట్టు ఓ చిన్న హింట్ ఇచ్చి కబాలి కథ ఇంకా పూర్తి కాలేదని తెలపకనే తెలిపాడు. ఈ సీక్వెల్ కూడా పా. రంజిత్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుందట. కానీ ఇప్పటి వరకూ ఈ విషయంపై దర్శకనిర్మాతలు గాని, రజనీ గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.