పుట్టినరోజు వేడుకలు వద్దన్న స్టార్!

kamal-hasan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ జూలై నెలలో ఓ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. చెన్నైలోని తన ఆఫీసులో కాలు జారి పడిపోయిన ఆయన, అప్పట్నుంచీ విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు. ఇక మరో నెల రోజులు విశ్రాంతికే పరిమితం కానున్న ఆయన, ఈ ఏడాది తన పుట్టినరోజు (నవంబర్ 7న) వేడుకలను కూడా జరపొద్దని అభిమానులకు విన్నవించారు. అయితే కమల్ పుట్టినరోజు జరపవద్దని కోరడానికి కారణం వేరే ఉంది. తమిళనాడు సీఎం జయలలిత కొద్దికాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతుండడం, ఆమె ఇలా ఉన్న పరిస్థితుల్లో వేడుకలు వద్దని కమల్ కోరారు.

ఇక కమల్ సినిమాల విషయానికి వస్తే, ఆయన హీరోగా నటిస్తూ ఉండడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న సినిమా ‘శభాష్ నాయుడు’ కొద్దినెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళింది. ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ కమల్ ఆరోగ్యం కుదుటపడే వరకూ వాయిదా పడింది. కమల్ హాసన్‌తో పాటు శృతి హాసన్, బ్రహ్మానందం ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది.