మరో తెలుగు సినిమా పై కన్నేసిన కరణ్ జోహార్

19th, October 2016 - 10:41:31 AM

Karan-Johar (1)
కరణ్ జోహార్… బాలీవుడ్ లోని పాపులర్ సెలబ్రిటీల్లో ఒకరు. దర్శకుడు, రచయిత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా అన్నింటిలోనూ మంచి సక్సెస్ చూసిన వ్యక్తి. ఈ మధ్య ఈయన పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైంది. అందుకు కారణం ‘బాహుబలి’ చిత్రం. బాలీవుడ్ మార్కెట్ లో ఏ తెలుగు సినిమా దక్కించుకోలేని మార్కెట్ ను ‘బాహుబలి’ అందుకుందంటే అందుకు కారణం కరణ్ జోహార్ అనే చెప్పాలి. ‘బాహుబలి’ హిందీ రైట్స్ ను కొని దాన్ని బాలీవుడ్ జనాల్లోకి తీసుకెళ్లి సినిమా గొప్ప విజయం సాధించడంలో కరణ్ జోహార్ చాలా దోహదపడ్డాడు. దీంతో హిందీ ప్రేక్షకుల్లో తెలుగు సినిమా స్థాయి, గౌరవం రెండూ పెరిగాయి.

ఇప్పుడీయన మరో తెలుగు సినిమాపై దృష్టి పెట్టాడు. అదే దగ్గుబాటి రానా నటిస్తున్న ‘ఘాజి’ చిత్రం’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 1971 లో కాలంలో ఇండియా – పాక్ యుద్ధం సమయంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం యొక్క హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. ఇప్పటికే బాలీవుడు ప్రేక్షకులకు పరిచయమున్న రానా ఈ సినిమాతో అక్కడ తన మార్కెట్ ను మరింత పెంచుకునే అవకాశం ఉంది. రానా సరసన తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదలకానుంది.