‘కాష్మోరా’ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచిన కార్తీ!

18th, August 2016 - 12:23:02 AM

Kashmoraa
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగు సినీ అభిమానుల్లోనూ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమధ్యే విడుదలై హిట్ కొట్టిన ‘ఊపిరి’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైన కార్తీ, తాజాగా ‘కాష్మోరా’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, కొద్దిసేపటి క్రితం కార్తీ స్వయంగా విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్‌లుక్‌లో కార్తీని చూసిన వారంతా అతడి మేక్ ఓవర్‌కు ఫిదా అయిపోయారు.

పూర్తిగా గుండు కొట్టించుకొని, ఓ యుద్ధ నేపథ్యంలో నడిచే కథలో సైనికాధికారిలా కనిపిస్తూ కార్తీ అందరినీ ఆశ్చర్యపరిచారు. పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాష్మోరా ఫస్ట్‌లుక్ ఇలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తీ చేసిన ప్రయత్నానికి అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.