రెండవ రోజు కూడా అదే పవర్ చూపించిన ‘కాటమరాయుడు’ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఏపి, తెలంగాణల్లో కలిపి సుమారు రూ. 24 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండవరోజు కూడా అదే జోరు కొనసాగించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కృష్ణాలో రూ.42. 5 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 22.3 లక్షలు, సీడెడ్ లో రూ. 95 లక్షలు ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు రాబట్టిన ఈ చిత్రం గుంటూరులో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షల వరకు వసూలు చేసింది.

ఇక ఈరోజు కూడా సెలవు కావడం, విద్యార్థులకు వేసవి సెలవులు మొదలుతుండటంతో ఈ చిత్రం కలెక్షన్లు రాబోయే రోజుల్లో కూడా మెరుగ్గానే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపిస్తుండటం, మొదటి అర్థ భాగం చాలా బాగుండటంతో అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పట్ల కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు.