విజయ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ !


తమిళ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ ఈరోజు తన 42వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులతో పాటు దక్షిణాది సెలబ్రిటీలంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది చాలా బహుమతులు కూడా ఇచ్చారు. కానీ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇచ్చిన బహుమానం మాత్రం అన్నింటిలోకి కాస్త ప్రత్యేకంగా అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇంతలా ఆశ్చర్యపరిచేలా కీర్తి సురేష్ ఏం బహుమానం ఇచ్చింది అనుకుంటున్నారా.. అదే ఒక పెయింటింగ్. ఇందులో విశేషమేమిటంటే ఈ పెయింటింగ్ కీర్తి సురేష్ స్వయంగా వేయడమే. తన అభిమాన నటుడైన విజయ్ కోసం తాను చేసిన చిన్న ఆర్ట్ వర్క్ అంటూ కీర్తి సురేష్ వీటిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వాటిని చూసిన విజయ్ అభిమానులు తమ హీరో పట్ల కీర్తి సురేష్ చూపిన అభిమానానికి ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఇకపోతే కీర్తి సురేష్, విజయ్ తో కలిసి ‘భైరవ’ సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.