స్టార్ హీరోయిన్ రేసులోకొచ్చేసిన కీర్తి సురేష్!

keerthi-suresh
2013లో మళయాల సినీ పరిశ్రమ ద్వారా ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేష్, ‘నేను శైలజ’, ‘రజనీ మురుగన్’, ‘రెమో’ లాంటి హిట్ సినిమాలతో దూసుకుపోతూ తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు. ఇక తాజాగా ఆమె తమిళంలో టాప్ హీరోల్లో ఒకరైన సూర్య హీరోగా నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఖరారయ్యారు. ‘తానా సెరిందా కూట్టమ్’ అన్న టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఇప్పటికే ధనుష్, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్‌తో నటించిన కీర్తి సురేష్, ఇప్పుడిక సూర్య సినిమాలో హీరోయిన్‌గా ఎంపికవ్వడంతో స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసినట్లేనని భావించవచ్చు. ఇక ఈ సినిమా మాత్రమే కాక, త్వరలో సెట్స్‌పైకి వెళ్ళడానికి సిద్ధమవుతోన్న చాలా పెద్ద సినిమాలకు నిర్మాతలు కీర్తిని సంప్రదిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. సూర్య సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ‘తానా సెరిందా కూట్టమ్’ను నిర్మించనుంది.