విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేస్తున్న యాష్

విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదల సన్నాహాల్లో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది. దీంతో అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. వాటిలో భాగంగానే ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ పేరుతో హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

వీటిలో రేపు సాయంత్రం బెంగుళూరులో జరగబోయే మ్యూజిక్ ఫెస్టివల్ వేడుకకు కన్నడ రాకింగ్ స్టార్, కె.జి.ఎఫ్ హీరో యాష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇలా ఒక తెలుగు హీరో సినిమా కోసం కన్నడ స్టార్ హీరో సమయాన్ని కేటాయించి మరీ సపోర్ట్ చేయడం నిజంగా అభినందించదగిన విషయం. ఇక మిగతా భాషల్లో జరగబోయే వేడుకలకు కూడా ఇలాగే స్టార్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 26న విడుదలకానుంది.