‘బాహుబలి’ తర్వాత ‘ఖైదీ 150’దే రికార్డు..!
Published on Jan 22, 2017 3:12 pm IST

khaidi
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ అంటూ వచ్చి అభిమానులకు సంబరాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన రీ ఎంట్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే పలు చోట్ల రికార్డులన్నింటినీ చెరిపేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు రికార్డులను కూడా చెరిపేసి, తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వసూళ్ళ పరంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రభంజనం బాహుబలి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా, ఖైదీ నంబర్ 150 రెండో స్థానంలోకి కొత్తగా వచ్చి చేరింది. 85 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన శ్రీమంతుడుని ఖైదీ 11 రోజుల్లో క్రాస్ చేసింది. లాంగ్ రన్‌లో సినిమా ఎక్కడివరకు వచ్చి ఆగుతుందన్నది వేచిచూడాలి. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించారు.

 
Like us on Facebook