యూఎస్‍లో ప్రీమియర్స్‌తోనే 1 మిలియన్ కొట్టిన ఖైదీ!

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా? అన్న ఆయన అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చేసింది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు చేసిన ‘ఖైదీ నంబర్ 150’ అనే సినిమా గత కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా కనిపిస్తూ వచ్చింది. ఇక భారీ అంచనాల మధ్యన నేడు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ సందడి నిన్న అర్థరాత్రి నుంచే మొదలైంది. తెలుగు సినిమాకు ఈమధ్య కాలంలో పెద్ద మార్కెట్‌గా అవతరించిన యూఎస్‌లో భారీ స్థాయిలో ఖైదీ ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేశారు.

ఇక ఈ ప్రీమియర్ షోస్ అంతటా ఇంకా పూర్తి స్థాయిలో కలెక్షన్స్ రిపోర్ట్స్ రాకముందే 136 స్క్రీన్స్‌లోనే 1 మిలియన్ డాలర్లు వసూలు చేసేసింది. ప్రీమియర్ షోస్ మొత్తం పూర్తయ్యేసరికి బాహుబలి రికార్డ్ కూడా బ్రేక్ అవ్వొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. యూఎస్ ప్రీమియర్స్ విషయంలో 1.3మిలియన్ డాలర్లు వసూలు చేసిన బాహుబలిదే ఇప్పటివరకూ పెద్ద రికార్డ్. బాహుబలిని ఖైదీ బ్రేక్ చేస్తుందో లేదో కొద్ది గంటల్లో తేలిపోనుంది. మెగాస్టార్ స్టామినా ఏంటో ఈ వసూళ్ళు చూస్తే స్పష్టమైపోతోందని చెప్పొచ్చు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించారు.